భాజపా అధికారంలో ఉన్న 17 రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అన్నదాతలకు ఉచిత కరెంట్ ఇస్తుందా అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో రైతు వేదిక భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించే భాజపా నాయకులు... రాష్ట్ర అభివృద్ధిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
యావద్దేశం మెచ్చేలా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని పునరుద్ఘాటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రులు చూశామని.. కానీ రైతుల కోసం ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు. కొత్త సంవత్సరం కానుకగా వచ్చే సోమవారం నుంచి రాష్ట్రంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేస్తామని తెలిపారు.
జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతుల బిల్లు బకాయిలు చెల్లించేందుకు కొత్తూరు ట్రైడెంట్ చక్కెర కర్మాగారం రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించి ఆస్తులు వేలం వేయిస్తామని తెలిపారు. ఇప్పటివరకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా చక్కెర కర్మాగారం యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు.
- ఇదీ చూడండి : 'విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో ఎన్నో మైలురాళ్లు దాటాం'