కరోనా వ్యాధి విజృంభిస్తోన్న కారణంగా ఇప్పట్లో పాఠశాలలు తెరవడం కష్టమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. విద్యార్థులు ఇంటివద్ద చదువుకోవడానికి ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేపట్టిందని తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ హైస్కూల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు.
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పంపిణీ చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రారంభించినట్లు తెలిపారు. ఇంతటి కరోనా విపత్కర పరిస్థితుల్లో విద్యాశాఖ అధికారులు కష్టపడి పాఠ్యపుస్తకాలు అందించేలా చర్యలు చేపట్టారన్నారు. కరోనా దృష్ట్యా పాఠశాలల ప్రారంభం ఆలస్యం అయినందున... పుస్తకాలు ముందే అందిస్తే విద్యార్థులు ఇంట్లో చదువుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పంపిణీకి ఆదేశాలు ఇచ్చారన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతం కోసం సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు..