కరోనా లాక్‌డౌన్ ప్రభావాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తం దొరక్క, దూరప్రాంత పేదలు హైదరాబాద్ వచ్చి క్యాన్సర్ తదితర సమస్యలకు చికిత్స పొందలేక పడుతున్న ఇబ్బందులకు ఈ బాలుడి పరిస్థితి అద్దం పడుతోంది. నాన్నమ్మ ఒడిలో సేదతీరుతున్న 11 సంవత్సరాల ఈ బాలుడి పేరు ఆదర్శ్. తల్లిదండ్రులు రైతు కూలీలు. ఊరు సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి. బాలుడి ఎడమ కంటిలో క్యాన్సర్ కణితి రావడంతో మూడు నెలల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్రచికిత్స చేసి కన్ను తొలగించారు. వచ్చే నెల 2న మళ్లీ ఆ ఆసుపత్రికి పరీక్షలకు వెళ్లాల్సి ఉంది.
అయితే కొద్దిరోజులుగా ఆదర్శ్ తలపై గడ్డలు రావడం, జ్వరం, ఆహారం తినలేకపోతుండడంతో శస్త్రచికిత్స నిర్వహించిన ఆసుపత్రికి వెళ్లాలనుకున్నారు. లాక్‌డౌన్‌తో ప్రయాణ సౌకర్యాలు లేక, ఆర్థిక ఇబ్బందులతో విరమించుకున్నారు. మంగళవారం మూడు గంటలు ప్రయాణించి సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యుడు.. బాలుడి ఒంట్లో రక్తం తక్కువగా ఉందని, వెంటనే ఓ పాజిటివ్ రక్తం ఎక్కించాలని సూచించారు. ఆసుపత్రిలో రక్తం కొరత ఉందని, ఇద్దరిని తీసుకొచ్చి రక్తం ఇప్పిస్తే ఓ పాజిటివ్ తాము ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరో నాలుగు పరీక్షలు చేయాలని రాశారు. అందులో మూడు పరీక్షలను ప్రైవేటు వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో చేయించుకోవాలని తెలిపారు. ప్రైవేటులో పరీక్షలు చేయించుకునే స్తోమత లేక, ఎవరిని అడిగినా రక్తం దొరక్కపోవడంతో.. ఆ మనవడు, నానమ్మ సాయంత్రం 3 గంటల సమయంలో తిరిగి తమ ఊరికి పయనమయ్యారు.