సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న కంది గ్రామంలో సర్వే నంబరు 615లో 2004 సంవత్సరంలో ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్లస్థలాలను మంజూరు చేసింది. ఐదెకరాల విస్తీర్ణంలో ఒక్కో ప్లాటు వంద గజాల చొప్పున విభజించి 124 మంది దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. ఏ ఆధారం లేని ఆ పేద జీవులు ప్రభుత్వం అందించే సాయంతో తాము కూడబెట్టుకున్న రెక్కల కష్టం కలిపి ఓ గూడు నిలబెట్టుకున్నారు. ఆ ప్రాంతానికి లక్ష్మీనగర్ అనే పేరు పెట్టుకున్నారు.
ఇక్కడే మొదలైంది అసలు సంగతి
ఈ కాలనీకి ఆనుకుని ఉన్న సంగారెడ్డి బెంగుళూరు రహదారిని నాలుగు వరుసలుగా మర్చి జాతీయ రహదారిగా గుర్తించడం.. దీనికి సమీపం నుంచే ప్రాంతీయ వలయ రహదారి ఉండడం ఆ పేదజీవులకు శాపంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలు ఈ ప్రాంత సమీపంలో వెలిశాయి. అమాంతం భూమి రేటు గజం ధర రూ.20 నుంచి 25 వేలకు పెరిగింది. ఇంకేముంది రాజకీయనాయకుల అండదండలతో భూ బకాసురులు రంగంలోకి దిగారు. ఏకంగా యంత్రాలతో వచ్చి ఇళ్లు కూలగొట్టేస్తున్నారు. అడ్డుకున్న వారిని బెదిరిస్తున్నారు.
ఏ సమాచారం లేకుండా ఇదేం పని అని ప్రశ్నిస్తే మీదికి ఏకంగా జేసీబీ తీసుకొచ్చి బెదిరిస్తున్నారంటూ వాపోతున్నారు. ఆశల సౌధం కళ్లముందే కూల్చేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయులమైనామంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
అధికారులు ఏమంటున్నారంటే
అక్రమార్కుల దౌర్జన్యంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని స్థానిక తహసీల్దారు సరస్వతి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాథమిక విచారణలో భాగంగా ఆ భూమిని ప్రభుత్వమే పేదలకు ఇచ్చిందని ఆమె తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ చేయించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామంటున్నారు.
తమకు నిలువ నీడ లేకుండా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని.. అక్రమార్కుల నుంచి తమకు ప్రాణహాని పొంచిఉందని రక్షణ కల్పించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష