mohammed fariduddin: బుధవారం రాత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన మాజీ మంత్రి, తెరాస మహమ్మద్ ఫరీదుద్దీన్ భౌతికకాయానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. ఆయనతో పాటు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ సంతాపం తెలిపారు. ఫరీదుద్దీన్ అకాల మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంచి వ్యక్తిత్వం కలిగిన ఆయన లేకపోవడం పార్టీతో పాటు రాష్ట్రానికి తీరని లోటన్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఫరీదుద్దీన్ స్వగ్రామం హోతి(బి)లో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారని కేటీఆర్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ రావాలనుకున్నారని.. కానీ స్వల్ప అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఫరీదుద్దీన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఫరీదుద్దీన్ కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. వారి ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని ప్రార్థిస్తున్నామన్నారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
మాజీ మంత్రివర్యులు, అజాతశత్రువు, సౌమ్యుడు, అందరినీ ప్రేమించి దగ్గరకు తీసుకునే మంచి వ్యక్తిత్వం గల నాయకుడు మహమ్మద్ ఫరీదుద్దీన్. ఆయన అకాల మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సీఎం కేసీఆర్ గారు ఇక్కడకి రావాలనుకున్నారు. కానీ స్వల్ప అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. వివిధ హోదాల్లో రాష్ట్రానికి ఆయన ఎన్నో సేవలందించారు. ఆయన వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ సీఎస్‌ను ఆదేశించారు. ఆయన స్వగ్రామం హోతి(బి)లో జరగబోయే కార్యక్రమంలో వారికి ఘనమైన నివాళులర్పిస్తాం. వారి వ్యక్తిత్వాన్ని, మంచితనాన్ని ప్రజలెప్పుడూ మరవరు. వారి ఆత్మకు శాంతించాలని ప్రార్థిస్తాం. -కేటీఆర్, రాష్ట్ర మంత్రి
సీఎం సంతాపం
ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, తెరాస నేత మహమ్మద్ ఫరీదుద్దీన్ (64) బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన.. బుధవారం రాత్రి అక్కడే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధి హోతి(బి) గ్రామంలో జన్మించిన ఫరీదుద్దీన్ విద్యాభ్యాసం అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. స్వగ్రామంలో సర్పంచిగా గెలిచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో రెండోసారి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో మైనారిటీ సంక్షేమం, సహకార శాఖల మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెరాసలో చేరారు. 2016లో తెరాస తరఫున శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇటీవలే ఆయన పదవీకాలం ముగిసింది. ఫరీదుద్దీన్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు.
గురువారం స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. మంత్రులు మహమూద్‌అలీ, హరీశ్‌రావు ఆసుపత్రికి వెళ్లి ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ తదితరులు సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి:
Mohammed fariduddin : గుండెపోటుతో మాజీ మంత్రి ఫరీదుద్దీన్ మృతి.. సీఎం సంతాపం