KCR In Praja Ashirvada Sabha in Maheshwaram : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 5ఏళ్లు ఆగం అవుతామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మహేశ్వరంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ గత పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రైతు బంధు దుబారా అని అంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రైతు బంధు ఎకరానికి రూ.16వేలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు 24 గంటల విద్యుత్ వృధా అంటున్నారని.. 3 గంటల కరెంటు సరఫరా చేస్తే సరిపోతుందని రేవంత్ అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రచారంలో స్పీడ్ పెంచిన కారు - యువ ఓటర్లపై స్పెషల్ ఫోకస్
'ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ధరణీ స్థానంలో భూమాత తెస్తామంటున్నారు. కాంగ్రెస్ తెచ్చేది భూమాత కాదు.. భూమేత. కాంగ్రెస్ వచ్చాక.. ధరణిని తొలగిస్తే మళ్లీ అరాచకమే ఓటు జాగ్రత్తగా వేయకుంటే పదేళ్లుగా చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది'- కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
CM KCR on Telangana Development : మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి సబిత ఇంద్రారెడ్డి నిరంతరం ప్రజల కోసం తపించే నాయకురాలని తెలిపారు. ప్రజలకు వచ్చిన సమస్యలు నిత్యం పరిష్కరిస్తున్నారని చెప్పారు. మహేశ్వరంలో రూ.100 కోట్లతో నాలా సమస్యలు పరిష్కరించారని పేర్కొన్నారు. కేవలం సబిత కృషితోనే కందుకూరులో మెడికల్ కళాశాల వచ్చిందన్నారు. ఫాక్స్‌కాన్ పరిశ్రమతో లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఆ గట్టునున్నావా ఓటరన్నా ఈ గట్టునున్నావా - ప్రజానాడి తెలియక అభ్యర్థుల పరేషాన్
CM KCR Fires on Congress Past Ruling : అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. రైతులకు 3 గంటలే కరెంటు ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. వంటలు చేసి పెట్టండి.. మేము వడ్డిస్తామన్న సామెతలా కాంగ్రెస్ తీరుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇంటింటికి తాగు నీరు అందించామని తెలిపారు. రైతులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నందునే సంపద పెరిగిందని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చారు. రైతుబంధు పథకాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని.. ఇలాంటి పథకాలతో వ్యవసాయదారులు కుటుంబాలు కళకళలాడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్ర శాసనసభ సమరంలో హోరాహోరీ - ప్రచారంతో కదం తొక్కిన బంధుజనం
ఎన్నికలు రాగానే ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థితో పాటు వారి చరిత్ర కూడా చూడాలని కేసీఆర్ సూచించారు. ప్రజల శ్రేయస్సు కోసం ఏ పార్టీ ఎలా ఆలోచిస్తుందో అందరూ గమనించాలని చెప్పారు. బీఆర్ఎస్ పుట్టిందే రాష్ట్ర ప్రజల హక్కుల కోసమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇష్టానికి వ్యతిరేకంగా 1956లో ఆంధ్రతో కలిపిందని.. దాని వల్ల 60 ఏళ్లు ఎన్నో బాధలు పడ్డామన్నారు. రాష్ట్ర సంపద పెరుగుతున్నా కొద్దీ.. సంక్షేమ పథకాలకు నిధులు పెంచుతున్నామని తెలిపారు.
బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే-పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం : సీఎం కేసీఆర్