వారాంతం సెలవు కావడంతో ఆదివారం ఏడుపాయల వనదుర్గాభవాని క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, ఇతర ప్రాంతాల వారు అమ్మ సేవకు తరలివచ్చారు. అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, సహస్ర నామార్చన చేశారు. బంగారు కిరీటం, ముక్కు పుడక, వెండి కన్నులు, హారం, వివిధ రకాల పుష్పాల అలంకరణతో శోభాయమానంగా దర్శనమిచ్చింది. చెక్‌డ్యాం, మంజీర నది పాయల్లో, ఘనపూర్ ప్రాజెక్టు సమీపంలో పుణ్యస్నానాలు ఆచరించారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపాలు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. కార్యనిర్వాహక అధికారి శ్రీనివాస్, పాపన్నపేట ఎస్‌ఐ సురేశ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సజావుగా జాతర: పాలనాధికారి
మహాశివరాత్రి జాతరకు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని పాలనాధికారి హరీశ్ తెలిపారు. ముందస్తు ఏర్పాట్లతో సజావుగా జాతర సాగిందని పేర్కొన్నారు. ప్రధానంగా జాతరలో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టామన్నారు. తప్పిపోయిన 41 మంది పిల్లలను సంరక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించానట్లు వెల్లడించారు. జాతరలో అనారోగ్యంతో ఉన్న 1000 మంది రోగులను పరీక్షించి, తగు వైద్యం అందించామన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా జాతర శాంతియుతంగా నిర్వహించడంలో పోలీసుల పాత్ర మరువలేనిదని వివరించారు. నీటిపారుదల, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, రెవెన్యూ, మెడికల్, వెటర్నరీ, ఫైర్, శిశు సంక్షేమ, సమాచార శాఖతో పాటు తదితర శాఖలకు అప్పగించిన విధులను సమర్థంగా నిర్వహించారని తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది సహకరించారన్నారు.