Harish Rao in Cheques Distribution Program at Narayankhed : కాంగ్రెస్ నేతలు మంచినీళ్లు తాగాలన్నా.. దిల్లీకి పరిగెత్తుతారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు(Harishrao) ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ(PM Modi) అవకాశం వచ్చినప్పుడల్లా తెలంగాణపై విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. పదేళ్లు గడిచినా తెలంగాణ ఏర్పాటును అవమానిస్తున్నారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ(Cheques Distribution Program) కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ 6 గ్యారంటీలు(Congress Guarantee) కర్ణాటకలో అమలవుతున్నాయా అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కర్ణాటక సరిహద్దు ప్రజలు తెలంగాణ ఆస్పత్రులకు వస్తున్నారని వివరించారు. అక్కడ ఆస్పత్రులు బాగా లేవనే కారణంతోనే ఇక్కడి దవాఖానాలకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ఆర్నెళ్లకో ముఖ్యమంత్రి మారతారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నేతలు మంచినీళ్లు తాగాలన్నా.. దిల్లీకి పరిగెత్తాల్సిందేనని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు బాస్‌లు దిల్లీలోనే ఉన్నారని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవకాశం వచ్చినప్పుడల్లా తెలంగాణపై విషం చిమ్ముతున్నారని.. పదేళ్లు గడిచినా తెలంగాణ ఏర్పాటును అవమానిస్తున్నారని ఆవేదన చెందారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు.. రాష్ట్ర ప్రజలు సంబురాలు చేసుకోలేదని మోదీ అవమానించారన్నారు.
"రాష్ట్రంలో ఉండే మీరే బీఆర్‌ఎస్‌కు హైకమాండ్. కానీ కాంగ్రెస్ నాయకులకు దిల్లీనే హైకమాండ్ అన్నారు. మంచినీళ్లు తాగాలన్నా అక్కడికే వెళ్లానన్నారు. కర్ణాటక ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో రాష్ట్రంలో అధికారం ఇస్తే అదే పరిస్థితి. పార్లమెంటులో మోదీ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే మనం పండుగ చేసుకోలేదంట. ఇలా సందర్భం దొరికిన ప్రతీసారి తెలంగాణపై విషం చిమ్ముతారు. తెలంగాణకు మోసం చేసింది బీజేపీనే. ఆనాడు ఏడు మండలాలను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్‌లో కలిపేశారు." -హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
తెలంగాణ ఏర్పడగానే మోదీ ఈ రాష్ట్రానికి మోసం చేశారని మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు. రాత్రికి రాత్రే తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో కలిపింది మోదీ కాదా అంటూ ప్రశ్నించారు. తెలంగాణపై విషం చిమ్మటం తప్పితే.. రాష్ట్రానికి ప్రధాని చేసిందేమీ లేదని మండిపడ్డారు. తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టునయినా.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ నియోజకవర్గ ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.