![fungus-attack-on-potato-farming-ar-chinna-hyderabad-jaheerabad-mandal-in-sanagreddy-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10248287_potato1.jpg)
ఆలుగడ్డ పంటకు ఆకుమచ్చ తెగులు క్రమంగా విస్తరిస్తోంది. ఫలితంగా మొక్కలు ఎండిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిన్నహైదరాబాద్ గ్రామానికి చెందిన నారాయణరెడ్డి అనే రైతు నెల క్రితం రెండెకరాల్లో ఆలుగడ్డ పంట వేశారు. ఎదుగుదల బాగానే ఉన్నప్పటికీ వారం నుంచి అక్కడక్కడా మొదలై ఆకులు, మొక్కలు ఎండే పరిస్థితి ప్రస్తుతం పొలం మొత్తానికి విస్తరించింది. పూత, కాతతో కళకళలాడాల్సిన పంట కోత దశను తలపించేలా ఎండిపోతోంది. ఏమి చేయాలో తోచక అయోమయానికి గురవుతున్నారు. ఈయన ఒక్కరే కాదు... ఆలుగడ్డ పంటకు ఆకుమచ్చ తెగులు సోకడంతో జహీరాబాద్ ప్రాంతంలోని వందలాది మంది రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో...
నేలవాలిన పంట
![fungus-attack-on-potato-farming-ar-chinna-hyderabad-jaheerabad-mandal-in-sanagreddy-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10248287_potato.jpg)
అనువైన నేలలు.. తక్కువ నీటి వినియోగం, స్వల్ప వ్యవధిలో చేతికి వచ్చే అవకాశం ఉండటంతో ఆలుగడ్డను రాష్ట్రంలోనే జహీరాబాద్ ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. నవంబరు రెండో వారం నుంచి డిసెంబరు చివరి వరకు విత్తనం వేస్తుంటారు. 80 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తుంది. గత అక్టోబరు, నవంబరులో వర్షాలు అధికంగా కురవడంతో బావులు, బోర్లల్లో నీరు పుష్కలంగా ఉంది. ఈ ఏడాది ఎక్కువ మంది ఈ పంటపై మొగ్గు చూపారు. దాదాపు 5వేల ఎకరాల్లో సాగు చేశారు. వారం, పది రోజులుగా ఆకు మచ్చ తెగులు వెంటాడుతోంది. పొలంలో అక్కడక్కడా ఆకు ముడత మొదలై క్రమంగా విస్తరిస్తోంది. కొందరి పొలాల్లో కొన్ని మొక్కలు పూర్తి ఎండిపోగా, మరికొందరు పొలంలో మొత్తం ఎండి నేల వాలుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే కోతకు వచ్చిన సమయంలో మాదిరిగా ఎండి పోతుండటంతో కర్షకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరంభంలోనే గుర్తిస్తే మేలు...
ఈ విషయాన్ని జహీరాబాద్ వ్యవసాయశాఖ ఏడీ భిక్షపతి దృష్టికి తీసుకెళ్లగా సమస్యకు కారణం, పరిష్కార మార్గాన్ని ఆయన వివరించారు. ‘
"భూమిలో సారం తగ్గిపోయి శిలీంధ్రాలు ఉత్పత్తి అయి ఆకుమచ్చ తెగులు సోకుతుంది. ప్రాథమిక దశలోనే దీనిని గుర్తించి సమయానుకూలంగా మందులు పిచికారీ చేస్తే నివారించవచ్చు. కొద్దిపాటి అజాగ్రత్త వహించినా పొలం మొత్తానికి వ్యాపించి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముందుగా ఆకులపై మచ్చలు మొదలై కాండం, వేర్లకు పాకి మొక్క మొత్తం ఎండిపోతుంది. నివారణకు కవచ్ (పౌడర్) 3 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి ఎకరానికి అరకిలో పౌడర్ పిచికారీ చేయాలి. అలాగే సాఫ్ అనే ద్రావణాన్ని 2 గ్రాములు 2 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి 300 నుంచి 400 గ్రాములు చల్లితే మేలు.’’
- భిక్షపతి, జహీరాబాద్ వ్యవసాయశాఖ ఏడీ
ఇదీ చదవండి: పతంగి ఎగరేస్తూ వెళ్లి కాలువలో శవమై తేలిన చిన్నారి