Heavy rains crop loss in Telangana : ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలు.. వర్షాలకు నీటిపాలవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో తూకాల ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో అన్నదాతల ఆగమవుతున్నారు. నల్గొండ జిల్లాలో రెండురోజులుగా కురుస్తున్న వానలతో ఐకేపీ కేంద్రాలకు తెచ్చిన ధాన్యం నీటిపాలైంది. తిప్పర్తి మండలం పజ్జూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో గత మూడురోజుల క్రితం కాంటాలు వేయగా.. సకాలంలో లారీలు రాలేదు. దీంతో సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షాలకు ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి.
Farmers Crop Loss In Telangana : లారీలు, ట్రాక్టర్లను రైతులే తెచ్చుకుంటే కాంటాలు వేస్తామంటూ ఐకేపీ నిర్వాహకులు ఉచిత సలహా ఇస్తుండటంతో వాహనాలు కిరాయికి తెచ్చుకుని ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెచ్చిన ధాన్యంలో తరుగు పేరుతో క్వింటాల్‌కు 3 నుంచి 4 కిలోలు కోతపెడుతున్నారని రైతులు వాపోతున్నారు. వానాకాలం సీజన్ మొదలవుతుండటంతో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని స్థితిలో రైతులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
ఈ కేంద్రంలో వడ్లు పోసి రెండు నెలలవుతోంది. అప్పటి నుంచి ఎవరు కూడా వడ్లు కొనట్లేదు. వడగడ్ల వాన వచ్చి వడ్లు మొత్తం తడిసిపోతున్నాయి. కాంటాలు వెయ్యండని మొత్తుకుంటున్న కానీ, లారీలు రావట్లేదు అంటున్నారు. అకాల వర్షాలకు టార్పాలిన్లు కప్పేందుకు పరుగులు పెట్టాల్సి వస్తుంది. వర్షం పడితే సగం రాసిలో నీళ్లు ఉంటున్నాయి. త్వరగా కొనుగోలు చేయాలని కోరుతున్నాం. -రైతు
Farmers Crop Damage In Peddapally : పెద్దపల్లి జిల్లా మంథని మార్కెట్ యార్డ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నెల రోజులు గడిచినా పంట కొనుగోలు పూర్తికాకపోగా.. మూడుసార్లు వర్షం పడి ధాన్యం తడిసిపోయిందని కర్షకులు వాపోతున్నారు. అధికారులు సన్నకారు రైతులను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. తక్కువ ధరొచ్చినా.. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవటం తప్పిస్తే మరోమార్గం కనిపించటం లేదని ఆవేదన చెందుతున్నారు.
మెదక్ జిల్లా సోంపేట మండలం శభాష్‌పల్లిలో అకాల వర్షంతో కొనుగోలు కేంద్రంలో ఉన్న బస్తాలు తడిసిపోయాయి. కొనుగోళ్లలో జాప్యం, ధాన్యం తరలింపులో అధికారుల అలసత్వం ప్రదర్శిస్తున్నారని పలుచోట్ల రైతులు రోడ్డెక్కారు. మెదక్ జిల్లా కౌడిపల్లి, శివంపేట, రామాయంపేట ప్రాంతాల్లో ధర్నా నిర్వహించారు. రోడ్డుపై ధాన్యం పోసి తగలబెట్టారు. మహబూబాబాద్ జిల్లా నైనాల, ముడుపుగళ్లు గ్రామాల్లో రహదారిపై ధాన్యం బస్తాలు వేసి, రైతులు రాస్తోరోకో చేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. లారీలు రాక, తూకాలు వేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
'నాది కాంటాలై రెండు రోజులు అవుతోంది. పంట కోసిన తర్వాత నెల పదిహేను రోజులకు నా సీరియల్ వచ్చింది. సీరియల్ ప్రకారం కాంటాలయ్యాయి. ట్రాక్ట్రర్కి ఎత్తిన తర్వాత రెండు రోజులు వేబ్రిడ్జి దగ్గర ఆగల్సి వచ్చింది. రోజుకు రూ.1000 ట్రాక్టర్‌కి ఇచ్చాం'. -రైతు
ఇవీ చదవండి: