సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్‌లోని దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ కార్యాలయంలో మిశ్రమ పంటలపై, చిరుధాన్యాల సాగుపై అధికారులు కార్యక్రమాన్ని నిర్వహించారు.
పటం సహితంగా..
అర్జున్‌నాయక్ తండా, మూడ్ తండాల్లో వ్యవసాయ భూముల పటాలను మహిళలు ముగ్గుతో గీసి నల్లరేగడితో పాటు ఎర్ర భూములు ఎక్కడున్నాయో చూపారు. సుమారు 25 రకాల వరకు చిరుధాన్యాల పంటలు సాగు చేస్తున్నామని వివరించారు. రాగులు, ఉలువలు, కొర్రలు, సామలు, సజ్జలు, జొన్నలు, పెసర్లు, మినుములు... ఇలా మిశ్రమ పంటలకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. ఒక ఎకరంలో సాగయ్యే వాటిని అధికారులు నమోదు చేయకపోగా కేవలం మిశ్రమ పంట అని రాసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల కొన్ని పంటలు పండుతున్నట్లు అసలు రికార్డుల్లోకే రావడం లేదని వాపోయారు.
ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం..
ఈ విషయాన్ని అధికారులు అంగీకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. స్థానికంగా వాడే వంగడాల వివరాలు సేకరించకపోవడంతో అరుదైన విత్తనాలు అంతరించే ప్రమాదమూ ఉందన్నారు. వీటినీ గుర్తించేలా చొరవ చూపాలని డీడీఎస్ ప్రతినిధులు, మహిళా రైతులు అధికారులను కోరారు. తాము సాగు చేస్తున్న చిరుధాన్యాల విస్తీర్ణానికి, అధికారులు నమోదు చేస్తున్న గణాంకాల మధ్య వ్యత్యాసం ఉంటోందని కొన్ని ఆధారాలతో నిరూపించారు.
లోపాలు సరిదిద్దుకుంటాం..
ఈ లోపాలను సరిదిద్దేందుకు కృషి చేస్తే తమ వంతు సహకారం అందిస్తామని జిల్లా వ్యవసాయాధికారి నరసింహారావు స్పష్టంచేశారు. ప్రభుత్వం పంటల నమోదు ప్రక్రియను పక్కాగా చేపడుతోందని వెల్లడించారు. అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని... అన్ని వివరాలు నమోదయ్యేలా చొరవ చూపుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ఇక్కడి నుంచే నాంది పలుకుతామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'కలరి'లో ఆరితేరిన 'పద్మశ్రీ' మీనాక్షి అమ్మ