కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నాలతో హోరెత్తించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల వద్ద నిరసనలు తెలిపి సంతకాల సేకరణ ప్రారంభించింది. వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయొద్దని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కిసాన్- మజ్దూర్ బచావో దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు మాణికం ఠాగూర్ పాల్గొన్నారు. ఆయన గాంధీ విగ్రహనికి నివాళులు అర్పించారు.
రుణమాఫీ హామీ అమలు చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయని పీసీసీ ఛీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కేవలం రైతులకు మాత్రమే పంటలను నిల్వపెట్టుకునే అవకాశం ఉండేది. మోదీ తీసుకువచ్చిన కొత్త చట్టంతో కార్పొరేటు సంస్థలకు సైతం పంటలను నిల్వచేసుకునే అవకాశం వచ్చిందన్నారు. రైతులకు మద్దతు ధర ఇచ్చేలా చట్టబద్ధత కల్పించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రుణమాఫీ చేస్తామన్న హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేయలేదని.. పంట నష్ట పరిహారం ఇవ్వడం లేదని విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది
స్వరాష్ట్రం ఇచ్చి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆంకాక్షను నెరవేర్చారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలందిరికీ సమాన అవకాశాలు వచ్చి అందరూ అభివృద్ధి చెందాలని సోనియా కలల కన్నారని... కేసీఆర్ పాలనలో అది నెరవేరలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని.. ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ మెదక్ ఎంపీగా గెలిచి ప్రధాని అయిన సంవత్సరం 1979కిగుర్తుగా 2023లో జరిగే ఎన్నికల్లో 79స్థానాల్లో గెలిచేందుకు ఐక్యంగా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు మాణికం ఠాగూర్ దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: గాంధీ ఆస్పత్రిలో అసభ్యంగా ప్రవర్తించిన సిబ్బంది సస్పెన్షన్