సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పురపాలిక పరిధిలోని శిరిడి సాయి కాలనీలో కలకలం రేగింది. ఓ ఇంటి ముందు కోడిని పాతిపెట్టి ఉండడాన్ని యజమానులు గుర్తించారు. అక్కడకు సమీపంలోనే నిమ్మకాయ, పసుపు, కుంకుమ ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై భయాందోళనకు గురవుతున్నారు. దీనికి ఎవరు బాధ్యులో తమకు తెలియదని.. గత రాత్రి ఒకరితో గొడవ జరిగినట్లు తెలిపారు.
కాలనీలో కబ్జాపై తాను ప్రశ్నించినందుకే క్షుద్రపూజలకు పాల్పడి ఉంటారని ఇంటి యజమాని రామాంజనేయులు తెలిపారు. ఒకరిపై తనకు అనుమానముందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఇంతకు ముందూ నిమ్మకాయలు తమ ఇంటి మీద పడేశారని.. తాను పెద్దగా పట్టించుకోలేదన్నారు. కానీ గత రెండేళ్లుగా జరిగిన ఘటనలతో ఇప్పుడు నమ్మాల్సి వస్తోందన్నారు. ఎవరు పాతిపెట్టారో తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని బాధితుడు రామాంజనేయులు తెలిపారు.