సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఆశా పరిశ్రమ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో కంది మండల కేంద్రం నుండి సంగారెడ్డి కలక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. కష్ట సమయంలో ఆదుకోవాల్సింది పోయి.. కంపెనీ యాజమాన్యాలు ఇలా కార్మికులకు ఇబ్బంది పెట్టడం సరికాదని నిరసన తెలిపారు. జీతాలివ్వకుండా కార్మికులను ఇబ్బందులు పెట్టడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
మండల స్థాయి అధికారులకు బాధ చెప్పుకున్నా సమస్య పరిష్కారం కాలేదని, పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులను కరోనాను అడ్డం పెట్టుకుని అక్రమంగా లే ఆఫ్ ఇచ్చారని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. లాక్డౌన్ సమయంలో కార్మికులకు పూర్తి జీతాలు చెల్లించాలని పైఅధికారులు చెప్పినా వినకుండా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించాలని లేదంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..