Aadhar Center Problems in Sangareddy : ప్రస్తుతం ప్రతి సర్టిఫికెట్‌కు ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది సర్కారు. ప్రభుత్వ పథకాల కోసం కావచ్చు.. వ్యక్తిగత అవసరాల కోసం కావచ్చు దరఖాస్తు చేసుకున్న వారి ఆధార్‌లో తప్పులుంటే.. పని ముందుకు సాగక కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆధార్‌లో తప్పొప్పులను సవరించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే అవకాశం కల్పించింది. గడువు ముగుస్తోందనే ప్రచారం సైతం జరుగుతుండడంతో జనం ఒక్కసారిగా ఆధార్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. జనం తాకిడి పెరగడంతో ఆధార్ కేంద్రాల నిర్వాహకులు టోకెన్ల పద్దతి(Aadhar Token System) పెట్టారు.
రాత్రి 2 గంటలకి వచ్చినా.. టోకెన్లు దొరకడం కష్టమే : వృద్ధాప్య పింఛన్, రేషన్ కార్డులో పేర్ల మార్పుకోసం ఆధార్ నమోదు కేంద్రాలకు రాత్రి 2 గంటలకే వచ్చి కేంద్రాల వద్దే నిద్రపోతున్నామని, అయినా టోకెన్ దొరకడం లేదని చెబుతున్నారు. రోజుకు దాదాపు 50 నుంచి 60 మందికే టోకెన్లు ఇస్తుండడంతో.. ప్రజలు రాత్రి నుంచే మీసేవా కేంద్రాల వద్దకు చేరుకొని పడిగాపులు కాస్తున్నారు. అయినా అందరికీ టోకెన్లు దొరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి సాంకేతిక కారణాలతో సర్వర్లు మొరాయిస్తే.. గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Aadhar Card Update Centers in Sangareddy : సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ పురపాలక సంఘం పరిధిలో ఒక్క కేంద్రాన్ని మాత్రమే నిర్వహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా సాంకేతిక లోపాలతో సర్వర్ మెండికేసి ఒక్కోక్కరికి గంట సమయం పట్టడంతో మరింత ఆలస్యం అవుతోంది. దీంతో కేంద్రం వద్ద పెద్దఎత్తున లైన్ కడుతున్నారు. పట్టణంతో పాటు, మంగల్‌పేట, మన్సూర్‌పూర్, చాంద్‌ఖాన్‌పల్లి గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి ఆధార్ నమోదు(Aadhaar Enrollment)కు పడరాని పాట్లు పడుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు.. పని పూర్తికాకపోతే ఇంటికి వెళ్లి మరుసటిరోజు మళ్లీ తిరిగి వస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో సమయం వృధా అవ్వడమే కాకుండా ఆర్థికంగా నష్టపోతున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"ఆధార్ మార్పు కోసం పిల్లలను స్కూల్‌కి పంపలేదు. రోజంతా కేంద్రం దగ్గరే తిరగాల్సి వస్తోంది. అయినా ఆధార్ మార్పు అవ్వలేదు. మా పిల్లలకు సమయం వృథా అవుతోంది. టోకెన్లు ఇస్తున్నారు. అవి ఉంటేనే చేస్తున్నారు."- స్థానికుడు
People Demand Increase to Aadhar Centers : బయటికి వెళితే క్యూలైన్ తప్పిపోతుందనే భయంతో తినడానికి కూడా వెళ్లట్లేమంటున్నారు. ఇప్పటికే విషజ్వరాలతో ఒక పక్క బాధపడుతుంటే.. ఇక్కడికొచ్చి గంటల తరబడి వేచిచూస్తూ పస్తులు ఉండాల్సి వస్తోందని బాధితులు ఆవేదన చెందుతున్నారు. పిల్లలను పాఠశాలకు సెలవు పెట్టించి తీసుకొస్తే.. రోజూ తిరుగుతున్నా ఫలితం లేదంటున్నారు. మరిన్ని ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందంని ప్రజలు కోరుతున్నారు. సవరణకు గడువు పొడిగించి సహకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Aadhaar Number On Degree Certificate : ఇక డిగ్రీ మార్కుల మెమోపై నో ఆధార్ నంబర్.. UGC కీలక ఆదేశాలు