Headmasters Transfers From Sangareddy : బహుళ జోనల్ 2లో ఉన్న ఒక్క సంగారెడ్డి జిల్లా నుంచే ఏకంగా 40 మంది ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను మల్టీ జోన్ 1కి కేటాయించడం వివాదాస్పదంగా మారుతోంది. అంటే ఆ జిల్లాలో ఇప్పటి వరకు పనిచేసిన హెచ్‌ఎంల సంఖ్యలో మూడో వంతు ఖాళీ అవుతున్నారు. దీనివల్ల ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన కేడర్ సంఖ్య తారుమారైందని, ఇది సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో 317కు విరుద్ధమని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం స్పష్టం చేస్తోంది.
98 మందే మిగులుతారు..
Teachers Transfers in Telangana : ఉమ్మడి మెదక్ జిల్లా ప్రకారం.. పనిచేసే(వర్కింగ్) ప్రధానోపాధ్యాయులు 306 మంది ఉండాలని ప్రభుత్వం జీవో 317 ప్రకారం నిర్ణయించింది. సంగారెడ్డి జిల్లాలో 138 మంది హెచ్‌ఎంలు పనిచేస్తుండగా ఆ జిల్లాకు 122 మంది పనిచేసే వారు ఉండాలని నిర్ణయించింది. అంటే అక్కడ 16 మంది అదనంగా ఉన్నందున వారిని ఉమ్మడి జిల్లా పరిధిలోని మెదక్, సిద్దిపేట జిల్లాలకు పంపించాలి. అందుకు విరుద్ధంగా వారిని బహుళ జోనల్-1లోని ఇతర జిల్లాలకు పంపిస్తున్నారు. అదే సమయంలో బహుళ జోనల్-1 నుంచి 24 మందిని మల్టీ జోన్-2కి కేటాయిస్తున్నందున .. దానికి సమానంగా మళ్లీ మరో 24 మంది ప్రధానోపాధ్యాయులను సంగారెడ్డి జిల్లా నుంచి బహుళ జోనల్-1కి పంపిస్తున్నారు. అంటే మొదట 16 మంది, తర్వాత 24 మంది..మొత్తం 40 మందిని సంగారెడ్డి జిల్లా నుంచి తొలగిస్తున్నారు. దాని వల్ల చివరకు ఆ జిల్లాలో 98 మంది ప్రధానోపాధ్యాయులే ఉంటారు.
వరంగల్లోనూ ఇదే పరిస్థితి..
Teachers Transfers Issue in Telangana : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉందని, ఆ జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన సంఖ్య కంటే 24 మంది తగ్గుతున్నారు. నిబంధనల ప్రకారం ముందుగా నిర్ణయించిన సంఖ్య, కేటాయింపులు, పోస్టింగ్‌ల తర్వాత సంఖ్య ఒకటే ఉండాలని, హెచ్‌ఎంల విషయంలో పాఠశాల విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తోందని రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్.రాజగంగారెడ్డి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి విన్నవించారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేనతోనూ దీనిపై చర్చించారు.
ఐచ్ఛికాలు ఇవ్వని హెచ్‌ఎంలు
Telangana Teachers Transfers : తమను ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్, సిద్దిపేటకు కేటాయించకుండా నిబంధనలకు విరుద్ధంగా తమను బహుళ జోనల్-1లోని ఇతర జిల్లాలకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్న ప్రధానోపాధ్యాయులు ఆయా పాఠశాలలకు పోస్టింగ్‌ల కోసం ఐచ్ఛికాలు ఇచ్చుకోవడం లేదు. దీనివల్ల పాఠశాలల కేటాయింపు డోలాయమానంలో పడింది.