రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి పరిధి ఉస్మాన్‌నగర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారీ వర్షాలు, వరదలకు ఉస్మాన్‌నగర్‌లో ఇళ్లు నీటమునిగాయి. 15 రోజులుగా ప్రజలు వరద నీటితో ఇబ్బంది పడుతున్న స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్టించుకోకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉజ్మా శాకేర్, ఇందిరా శోభన్‌తో పాటు ఇతర మహిళా నేతలు వరద నీటలో ప్లకార్డులతో ఆందోళనకు దిగారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలనీలోని ఇళ్లనుంచి వరద నీరు తొలిగించే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. మహిళా నాయకులను స్టేషన్‌కు తరలించేందుకు బాలాపూర్ పోలీసులు రాగా.. వారి వాహనానికి అడ్డంగా బైఠాయించారు. పలువురు నేతలను కారులో ఎక్కించే ప్రయత్నం చేయగా.. ఉజ్మా శాకేర్ పోలీస్ వాహనంపైన కూర్చుని నిరసన తెలిపారు. మహిళా కాంగ్రెస్ నేతలకు స్థానిక మహిళలు మద్దతు పలికారు. ఇళ్లనుంచి నీటిని బయటకు తీయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేతలు ఉజ్మా శాకేర్, ఇందిరా శోభన్, బి. జట్సన్, అర్షద్ అలీ, వసీం, అబ్దుల్ రవుఫ్, సమద్ బిన్ సిద్దిక్, అబ్దుల్ బారి, అహ్మద్‌లను అరెస్ట్ చేసి.. బాలాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారికి 41 సీఆర్పీసీ నోటీసు ఇచ్చి వదిలేశారు.
ఇవీ చూడండి: నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా: మంత్రి హరీశ్