అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేస్తూ తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని వీఆర్ఏలు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా వీఆర్‌ఏల జేఏసీ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సీఎం కేసిఆర్ అసెంబ్లీలో రెండు సార్లు ప్రగతి భవన్లో ఒకసారి తమ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారని, ఆ హామీలు మాటల వరకే పరిమితం అయ్యాయని వెంటనే వాటిని పరిష్కరించాలని వీఆర్ఏ జేఏసీ జిల్లా ఛైర్మన్ ఎడ్ల వెంకటేష్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 22 వేల మంది వీఆర్ఏలు ఉన్నారని కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం సందర్భంగా వీఆర్‌ఏలను క్రమబద్ధీకరిస్తామని, పేస్కేలు వర్తింపజేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారని గుర్తుచేశారు. వీఆర్‌ఏల కుటుంబ సభ్యుల్లో అర్హులుంటే ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ప్రకటించారన్నారు. అర్హత కల వీఆర్ఏలకు ప్రమోషన్ ఇవ్వాలని, 55ఏళ్లు నిండిన వీఆర్ఏకు పెన్షన్ సౌకర్యం ఇచ్చి వారి వారసులకు కారుణ్య నియామకాల అవకాశం కల్పించాలని కోరారు. హామీల అమలు కోసం గత 20 నెలలుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 24 వరకు ప్రభుత్వం స్పందించకపోతే 25 నుండి సమ్మెలోకి వెళ్తామని వారు తెలిపారు.