Saroor Nagar Honor Murder Case: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో ఈనెల 4న జరిగిన హత్యకు సంబంధించిన దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. రిమాండ్ రిపోర్ట్‌లో పూర్తి వివరాలు పొందుపరిచారు. నాగరాజు హత్య కేసులో ప్రధాన నిందితుడు మోబిన్ అహ్మద్ ఇంటికి పెద్ద కుమారుడుకాగా... రెండేళ్ల క్రితం తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యత మోబిన్‌పై పడింది. తల్లి, ముగ్గురు చెల్లెళ్లు, తమ్ముడిని పోషించేందుకు పండ్లు విక్రయించేవాడు. గతేడాది రెండో సోదరిని లింగంపల్లికి చెందిన మసూద్ అహ్మద్‌కు ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ క్రమంలో మూడో సోదరి అశ్రిన్ సుల్తానాకు... భార్య మరణించి ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయంలో ఇంట్లో గొడవలు జరగగా... అక్కడే ఉంటే పెళ్లి చేస్తారని భావించి జనవరి 30న అశ్రిన్ ఇల్లు వదిలి తాను ప్రేమించిన నాగరాజు వద్దకు పారిపోయింది.
అజ్ఞాతంలోకి: ఫిబ్రవరి 1న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుని నాగరాజు, అశ్రిన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటికే ఆశ్రిన్ కుటుంబసభ్యులు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఫోన్ నెంబర్ల ఆధారంగా వివరాలు సేకరించారు. అనంతరం బాలానగర్ పోలీస్‌స్టేషన్‌కు ఇరు కుటుంబాలను పోలీసులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత నాగరాజు, ఆశ్రిన్ వికారాబాద్ ఎస్పీని ఆశ్రయించి రక్షణ కల్పించాలని కోరారు. పోలీసుల సూచనతో కొద్దికాలం దూరంగా ఉండాలనే ఉద్దేశంతో తమ వివరాలు బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. ఈ మధ్యలో తాను మతం మారేందుకు సిద్ధమని నాగరాజు... మోబిన్‌తో రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు వెల్లడించారు.
రంజాన్ వల్ల వాయిదా: పెళ్లి తర్వాత ఆశ్రిన్ లింగంపల్లిలోని సోదరితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండేది. సోదరి భర్త ద్వారా అశ్రిన్ దంపతుల వివరాలు తెలుసుకున్న మోబిన్... స్నేహితుల సహకారంతో సాంకేతికతను ఉపయోగించి... నాగరాజు సెల్‌ఫోన్‌లో మాల్‌వేర్ ఇన్‌స్టాల్ చేయించాడు. ఓ యాప్ ద్వారా ఏ సమయంలో ఎక్కడున్నారనే సమాచారం తెలుసుకునేవాడు. మార్చిలోనే హత్యకు పథకం వేసినా... రంజాన్ ఉపవాస దీక్షలు ఉండడంతో వాయిదా వేశాడు. పండుగ ముగిసిన మరుసటిరోజే... నాగరాజు ఏ ప్రాంతాల్లో తిరుగుతున్నాడనే విషయాన్ని గుర్తించాడు. ఈ నెల 4న ముందుగా మలక్‌పేట్ కార్ల దుకాణంలో దాడికి ప్రయత్నించినా వీలు కాలేదు. దీంతో సాయంత్రం సరూర్‌నగర్ పరిధి అనిల్‌నగర్‌కాలనీలో బైక్‌పై వెళ్తున్న దంపతుల్ని అడ్డగించి బావ మసూద్‌తో కలిసి నాగరాజును హతమార్చాడు.
ఇవీ చూడండి: