Two died due to illness in Mailardevpally: హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లిలో తాగునీటి కలుషిత కలకలం రేపింది. మొఘల్ కాలనీలోని పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో 10 మందికిపైగా వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొఘల్ బస్తీకి 8 రోజుల కిందట సరఫరా చేసిన జలాలు తాగి మొహ్మద్ సత్తార్ కుమారుడు ఖైసర్ మంగళవారం మృతి చెందగా బుధవారం అదే వీధిలో ఉండే మాజీద్ భార్య ఆఫ్రీన్ సుల్తానా మృతి చెందింది. సుల్తానా కుమార్తె ఫైజ్ బేగం కూడా తీవ్ర అస్వస్థతతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
కాలనీవాసులు భయాందోళన: అజహరుద్దీన్, సమ్రీన్ బేగం, ఆర్పీ సింగ్, షహజాదీ బేగంతోపాటు ఇతైషా ముద్దీన్, ఇఖ్రా బేగం, అస్రా బేగం చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఒక్కసారిగా మొఘల్ కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. వరుస మరణాలు, తీవ్ర అస్వస్థతతో ప్రజలు ఇబ్బంది పడటం స్థానికంగా భయాందోళన నెలకొంది.మైలార్ దేవ్‌పల్లికి జలమండలి సరఫరా చేసే తాగునీటి పైపులైన్లు దెబ్బతిని నీరు కలుషితమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారం కిందట సరఫరా చేసిన నీరు దుర్వాసన రావడంతో సిబ్బందికి ఫిర్యాదు చేశామని చెబుతున్నారు.
అధికారుల చర్యలు: మొఘల్ కాలనీ వాసుల ఆందోళనతో హుటాహుటిన అక్కడి చేరుకున్న జలమండలి అధికారులు బాధితుల ఇళ్లల్లో నీటి నమూనాలు సేకరించారు. ఆ నీరంతా శుభ్రంగానే ఉందని, కలుషితం కాలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. రాజేంద్రనగర్ సర్కిల్ జలమండలి మేనేజర్ చంద్రశేఖర్, మైలార్ దేవుపల్లి డివిజన్ మేనేజర్ అబ్దుల్ ఖదీర్ ఆధ్వర్యంలో సిబ్బంది నీటి నమూనాలు సేకరించి పరిశీలించారు. మృతురాలి ఇంటితోపాటు చుట్టుపక్కల ఇళ్లలోనూ నమూనాలు సేకరించారు. బాధితులంతా ఫిల్టర్ నీటినే తాగుతున్నారని, మృతి చెందిన ఖైసర్, అఫ్రీన్ సుల్తానాల పోస్టుమార్టమ్ నివేదిక అందాక మరిన్ని వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.
జలమండలి స్పందన: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన ఘటనపై జలమండలి స్పందించింది. ప్రాథమికంగా ఆయా ప్రాంతాల్లో ఈనెల 8న జలమండలి జరిపిన పరీక్షల్లో నీటిలో ఎలాంటి హానికారక అవశేషాలు లేవని పేర్కొంది. ఈ ఘటనకు కారణం జలమండలి సరఫరా చేసిన తాగునీరు కాదని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు వివరించింది. ఆఫ్రీన్ సుల్తానా, మహ్మద్ ఖైసర్ ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతూ మృతి చెందినట్లు తెలిసిందిని అధికారులు స్పష్టం చేశారు. మూడంచెల శుద్ధి ప్రక్రియ తర్వాత నీటి సరఫరా చేస్తామని ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జలమండలి ప్రకటనలో చెప్పింది.
ఇవీ చదవండి: