తెరాస రాష్ట్ర కార్యదర్శి పదవికి అందె బాబయ్య రాజీనామా(resign) చేశారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో తనకు విలువ, గౌరవం కల్పించడం లేదని అందె బాబయ్య తెలిపారు. అవి లేని చోట తాను పార్టీలో ఇమడలేకనే.. పార్టీకి రాజీనామా చేసి.. ఈటెల రాజేందర్ బాటలో నడుస్తానని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు.
అన్యాయంగా పంపించారు..
ఈటల రాజేందర్‌ను అన్యాయంగా పార్టీ నుంచి బయటికి పంపించారని... ఈ సంఘటన ముదిరాజులందరిని కలత చెందిందన్నారు. తెరాస తీసుకున్న ఈ నిర్ణయం ముదిరాజులకు అవమానంగా భావించి ఆత్మగౌరవం కోసం పార్టీ పదవులను త్యాగం చేస్తామన్నారు. భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు వివరించారు.
ఎలాంటి సమాచారం ఇచ్చేవారు కాదు..
గుత్తేదారు పనులు, పైరవీలు చేయకుండా సొంత ఖర్చులతోనే పార్టీ అభివృద్ధి కోసం పని చేశానని అందె బాబయ్య గుర్తు చేశారు. షాద్‌నగర్‌లో పార్టీపరంగా, ప్రభుత్వపరంగా జరిగే అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తనకు ఎలాంటి సమాచారం ఇచ్చే వారు కాదని ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈటల రాజేందర్ వెంటే అడుగులు వేస్తానని, మరోసారి ముదిరాజ్ సంఘం నాయకులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం పలువురు సంఘాల నేతలతో కలిసి చర్చలు జరిపారు.
ఇదీ చూడండి. CM KCR: ఈ నెల 7న 19 డయాగ్నొస్టిక్ కేంద్రాల ప్రారంభోత్సవం