Rain in Hyderabad: రాజధాని నగరంలోని పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈదురుగాలులలో కూడిన వాన రావడంతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కూకట్‌పల్లి, మేడ్చల్, బాలానగర్, ఎంజె మార్కెట్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, బేగం బజార్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీగా ఈదురుగాలులు వీయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పాతబస్తీలోని మలక్‌పేట్ ప్రాంతంలో భారీవృక్షం నేలమట్టమైంది. బలమైన ఈదురుగాలులకు తీగలగూడలో చెట్టు కూలిపోవడంతో ద్విచక్రవాహనం ధ్వంసమైంది. శంషాబాద్‌లో కురిసిన భారీవర్షం విమానాల రాకపోకలపై ప్రభావం చూపింది. హైదరాబాద్ రావల్సిన 4 విమానాలను వాతావరణం సరిగా లేదని అధికారులు దారి మళ్లించారు.
విమానాల దారి మళ్లింపు: అధిక వర్షం కారణంగా శంషాబాద్‌కు రావాల్సిన 4 విమానాలను దారి మళ్లించారు. దిల్లీ, ముంబయి, విశాఖ, బెంగుళూరు నుంచి రావాల్సిన విమానాలను అధికారులు వెనక్కి పంపారు. దిల్లీ నుంచి వచ్చే విమానాన్ని బెంగళూరుకు తరలించారు. బెంగళూరు నుంచి వచ్చే విమానం నాగ్‌పుర్‌కు పంపారు. అలాగే విశాఖ, ముంబయి నుంచి వచ్చే విమానాలను విజయవాడకు మళ్లించారు.
మలక్‌పేట్, మూసారాంబాగ్, చాదర్‌ఘాట్, కోఠి, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, కొత్తపేట, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, కొండాపూర్, మియాపూర్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. బలమైన ఈదురుగాలులకు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ భవనంపై ఉన్న భారీ హోర్డింగ్ పక్కకు ఒరిగింది. మరోచోట పాత భవనం కూలిపోయి ఓ వృద్ధరాలికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు రాష్ట్రానికి రాగల మూడ్రోజుల పాటు వర్షసూచన ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
పలు జిల్లాల్లో ఈదురుగాలుల వర్షం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో వడగండ్ల వర్షం కురిసింది. ఈదురుగాలుల వర్షానికి ఓ ఇంటి రేకుల పైకప్పు ఎగిరిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. రాజపేట, బొమ్మలరామారం మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పటాన్‌చెరు, రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్, అమీన్‌పూర్‌లో పెద్దఎత్తున ఈదురుగాలులు వణికించాయి. భారీస్థాయిలో గాలులు చెలరేగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులకు ముత్తంగి ఓఆర్‌ఆర్ వద్ద బ్యానర్లు చిరిగిపోయాయి.
ఇవీ చూడండి: యాదాద్రి శివాలయం ఉద్ఘాటన మహోత్సవాలు.. రెండో రోజు యాగశాల ప్రవేశం
పేదల పాలిట 'జ్ఞాన వృక్షం'.. ఫ్రీగా ఐఐటీ కోచింగ్.. ఇప్పటికే 150 మందికి సీట్లు!