రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు, శనివారం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం లోకారి(కే)లో అత్యధికంగా 7.7, నామూర్‌లో 5.5, కరీంనగర్ మానకొండూరు మండలం ఈదుల గట్టెపల్లిలో 4.7, నల్గొండ జిల్లా మర్రిగూడలో 4.3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
ఈనెల 6న మధ్య బంగాళాఖాతంతో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని వెల్లడించింది. దీని ఫలితంగా హైదరాబాద్‌లో 3- 4 రోజుల వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
దంచికొట్టిన వాన..
హైదరాబాద్ మహానగర వీధుల్ని మరోసారి వరద ముంచెత్తింది. గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా ఎడతెరిపి లేకుండా కురిసిన జోరువానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరదనీరు చేరడంతో ప్రధాన మార్గాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి 7గంటల నుంచి చిరుజల్లులుగా మొదలై 15నిమిషాల్లోనే దాదాపు 3.5సెంటీమీటర్ల వాన నగరవ్యాప్తంగా కురిసింది. ముందస్తు హెచ్చరికలతో బల్దియా, ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కూకట్‌పల్లి, బంజారాహిల్స్, షేక్‌పేట, నాంపల్లి, లక్డీకాపూల్ ప్రాంతాల్లో విరిగిపడ్డ చెట్లను బల్దియా సిబ్బంది తొలగించారు. నగరం నైరుతి వైపున ఉరుములతో వాన బీభత్సం సృష్టించింది.
యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్, షేక్‌పేట, టోలిచౌకి, రాయదుర్గం, ఖాజాగూడ, బోరబండ, రహమత్‌నగర్ బస్తీల్లో భారీగా వరద నీరు ప్రవహించింది. మోకాళ్లలోతు వరదలో రోడ్లపై నిలిపిన ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. షేక్‌పేట ఆదిత్యనగర్, కృష్ణానగర్, యూసుఫ్‌గూడ పరిధిలో రోడ్ల పక్కనున్న కిరాణా దుకాణాల్లోకి, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో నివాసితులు ఇబ్బందులుపడ్డారు.
సోమాజీగూడ, బీఎస్ మక్తాల్లో వానకు తోడు ఎగువ ప్రాంతాల్లో నుంచి వరద పోటెత్తడంతో రోడ్లన్నీ నీట మునిగాయి. రాజ్‌భవన్ రహదారి, మక్తా రైల్వే గేటు, ఖైరతాబాద్ రైల్వే గేటు ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచింది. ప్రగతిభవన్, బేగంపేట ప్రాంతాల్లోనూ ప్రధాన రహదారులపై వరద నీటితో ట్రాఫిక్ నిలిచింది.
వాగులను తలపించిన శ్రీకృష్ణానగర్ వీధులు
లోతట్టు ప్రాంతమైన శ్రీకృష్ణానగర్‌లోని వీధులు వాగును తలపించాయి. కమ్యూనిటీహాల్ వీధిలో నడుములోతు వరదనీరు ప్రవహించింది. ఇక్కడి సింధూ టిఫిన్ సెంటర్, ఏ-బ్లాకులోని నాలా రోడ్డులో వరద ధాటికి చెత్త రిక్షా, ఓ ద్విచక్ర వాహనం కొట్టుకుపోయాయి. నీటిలో కొట్టుకుపోతున్న యువకుడిని స్థానికులు కాపాడారు. శ్రీకృష్ణానగర్ ఏ-బ్లాకు నుంచి లక్ష్మీనరసింహనగర్‌కు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్తు సరఫరా వ్యవస్థపై దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి అత్యవసరంగా ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందుబాటులో ఉన్న సీజీఎం, ఎస్‌ఈలతో పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్తుకు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా వినియోగదారులు 1912/100/స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీసుతో పాటు విద్యుత్తు కంట్రోల్‌రూంల నంబర్లు 7382072104/106/1574కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని సీఎండీ సూచించారు.