Covid positive to students: రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆ కళాశాలలో 14 మందికి కొవిడ్ సోకగా.. మరో 17 మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 31 కి చేరింది.
రెసిడెన్షియల్ కళాశాలలో దాదాపు 300 మందికిపైగా విద్యార్థులు ఉండగా... మంగళవారం 90 మంది విద్యార్థులకు ర్యాపిడ్ పరీక్షలు చేశారు. మిగిలిన వారికి ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో కొత్తగా 17 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ టెస్టులు చేయనున్నట్లు వైద్యారోగ్య సిబ్బంది వెల్లడించారు.
మరోవైపు ఒమిక్రాన్ కలవరం
Telangana omicron cases: మరోవైపు రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు చాపకింద నీరులా పెరిగిపోతున్నాయి. మంగళవారం మరో 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కాగా... రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 62 కి చేరుకుంది. ఈ 62 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 46 మంది టీకా తీసుకోకపోవటం కొసమెరుపు. ట్రావెల్ హిస్టరీ లేని ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధరణైనట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పుడు ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇన్ని రోజులు బయటి దేశాల నుంచి వచ్చినవాళ్లకే ఒమిక్రాన్ నిర్ధరణ కాగా.. ఇప్పుడు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేనివారిలోనూ వేరియంట్ గుర్తించటంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
ఇదీ చదవండి: Governor Tamilisai on Vaccination: టీకా ఒక్క డోసు తీసుకోవడంతో ఉపయోగంలేదు : గవర్నర్ తమిళిసై