కరోనా మూడోదశను ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సన్నద్ధమవుతోంది. రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చిన సూచనల మేరకు అప్రమత్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్పత్రులు తప్పక ఆక్సిజన్ జనరేటర్లను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదేశించింది. ఆగస్టు 31 నాటికి పడకల సంఖ్యకు తగిన విధంగా ఆక్సిజన్ జనరేటర్లు ఏర్పాటు చేయని ఆస్పత్రుల గుర్తింపును రద్దు చేస్తామని స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 200 కంటే తక్కువ పడకలు ఉన్న ఆస్పత్రులు 500 ఎల్పీఎం(LPM), 200 నుంచి 500 బెడ్స్ ఉన్న ఆస్పత్రుల్లో 1000 ఎల్పీఎం, 500 కంటే అధికంగా బెడ్స్ ఉన్న ఆస్పత్రుల్లో 2వేల ఎల్పీఎం సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కరోనా రెండో దశ ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఆక్సిజన్ పడకలు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు. మూడో దశ పొంచి ఉండగా.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఇదీ చదవండి: అంధుల జీవితాల్లో వెలుగు దివ్వె.. ఏడు పదుల వయసులోనూ అలుపెరగని కృషి