ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్కు ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. రంగారెడ్డి జిల్లాలో ఉదయం నుంచే అఖిల పక్ష నేతలు, ఆర్టీసీ ఐకాస నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డిపోల వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్నిచోట్ల ముందస్తు అరెస్టు చేశారు.
ఉప్పల్ డిపోకు చెందిన 130, చెంగిచెర్ల డిపోకు చెందిన 126 బస్సులు బయటికి రాకుండా డిపోలోనే ఉండిపోయాయి. ఆయా డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిపో వద్దకు ప్రదర్శనగా వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. దిల్సుఖ్నగర్ సిటీ డిపో, హైదరాబాద్ డిపో 2 వద్దకు చేరుకున్న కార్మికులను ముందస్తుగా అరెస్ట్ చేసి మలక్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇబ్రహీంపట్నంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో సాగర్ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. డిపో నుంచి బస్సులు బయటికి రాకుండా ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహా, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంచందర్, భాజపా, కాంగ్రెస్, తెదేపా, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ నాయకులు,ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'రేపు అన్ని డిపోల వద్ద ఫ్లకార్డులతో నిరసన'