Rabi season Rythu bandhu: రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు సంబంధించి.. రెండో రోజు రైతుబంధు పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇవాళ 1,255.42 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. నిన్న, నేడు కలిపి రూ.1,799.99 కోట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. రెండో రోజు 17,31,127 మంది లబ్ధిదారులకు పెట్టుబడి సాయం అందిందని.. ఈ రెండు రోజుల్లో కలిపి 35,43,783 మంది రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు వివరించారు.
వంద శాతం పైగా
రైతు కష్టం తెలిసిన నేత సీఎం కేసీఆర్ అని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుబంధు ఉద్దేశం డబ్బుల పంపిణీ కాదని.. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగంలోని ప్రతి ఎకరం సాగులోకి రావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ ఏడేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్.. వ్యవసాయ అనుకూల విధానాలతో పంటల ఉత్పత్తులు వందశాతం పైగా పెరిగాయని మంత్రి వెల్లడించారు. సాగు, పంట ఉత్పత్తులు పెరగడంతో అనేక రంగాలకు ఉపాధి లభించిందని హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని వ్యాపార రంగంగా కాకుండా..ఉపాధి రంగంగా చూడాలని సూచించారు. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని... దేశంలో అలా చూసిన ఒకే ఒక్క నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.
వ్యవసాయ రంగంపై దృష్టి
దేశంలో దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్న దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన వెంటనే వ్యవసాయ రంగం మీద దృష్టి సారించారని మంత్రి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో రూ. 60 వేల కోట్లు వ్యవసాయ రంగంపై ఖర్చుపెడుతున్నామని వివరించారు. కరోనా విపత్తులో ప్రభుత్వాల ఆదాయం తగ్గిపోయినా రైతుల కోసం రైతుబంధు వంటి వ్యవసాయ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Bandi Sanjay Comments on Cm Kcr: 'సీఎం కేసీఆర్‌వి బార్-దర్బార్ నిర్ణయాలే'