Revanth Reddy PadaYatra: రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో త్రిపుల్ వన్ జీవో నుంచి వెయ్యి ఎకరాలను మినహాయించిన మంత్రి కేటీఆర్.. రూ.5 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించారన్న ఆయన.. ఈపీఆర్ఆర్ఐ, జవహర్ కమిటీ నివేదికలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా కామేపల్లిలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. భూ దందా ఆరోపణలపై తన ఆస్తులు, కేటీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ ఛార్జీల పేరిట పేదలను బీఆర్ఎస్ సర్కార్ ఇబ్బందులు పెడుతోందని రేవంత్ విమర్శించారు. ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి, గోపాల్‌రావు వల్లే విద్యుత్ సంస్థలు అప్పుల్లో మునిగాయని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వీరంతా ఊచలు లెక్కించక తప్పదని హెచ్చరించారు. కరెంటు పోరాటంలో వామపక్షాలు కలిసి రావాలని కోరారు. ధరణి పోర్టల్‌ను ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
"వట్టినాగుల పల్లెలో 1000 ఎకరాలకు సంబంధించి జీవో నెం 111 నుంచి మినహాయింపు పొందారు హైకోర్టులో. ప్రభుత్వం తప్పుడు అపడఫిట్ దాఖలు చేసి.. కోర్టును తప్పుదోవ పట్టించి ఆ 1000 ఎకరాలను 111 జీవో నుంచి మినహాయింపు తీసుకున్నారు. అందులో ఉన్న రాజులు, రావులు ఎవరు..? తద్వారా లబ్ధిదారులు ఎవరు? దిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణ ఎదుర్కొంటున్న అరుణ్ పిళ్లై భూమిని ఈడీ సీజ్ చేసింది. ఈ భూమి అనేది అందులోనిది కాదా.. దాదాపు రూ.4000 నుంచి రూ.5000 కోట్ల కుంభకోణానికి కేటీఆర్ పూనుకున్నారు. ఈ విషయం బాధితులు నాకు ఫిర్యాదు చేశారు. నేను రాష్ట్ర ప్రభుత్వం మీద, కేటీఆర్ మీద నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నాను. కేటీఆర్ ముందుకు రావాలి. ఈ విషయంపై సిట్టింగ్‌తో విచారణ జరిపించాలి." - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: