అభివృద్ధిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ముందంజలో ఉందని హెచ్ఎండీఏ సెక్రెటరీ, హైదరాబాద్ గ్రోత్‌కారిడార్ లిమిటెడ్ ఎండీ సంతోష్ పేర్కొన్నారు. అమీర్‌పేట్ హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలో ఆయన.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నగరానికి మణిహారంగా ఉన్న 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును మరింతగా ఆధునీకరించేందుకు రూ. 100 కోట్ల వ్యయంతో ఓఆర్ఆర్ లైటింగ్ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్నట్లు సంతోష్ తెలిపారు. ఓఆర్ఆర్పై మరో రెండు ఇంటర్‌ఛేంజ్ నిర్మాణ పనులు ఈ ఏడాదిలో చేపడతామని వివరించారు. ప్రస్తుతం ఉన్న 19 ఇంటర్‌ఛేంజ్‌లలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
కోకాపేట్ వద్ద వరల్డ్ క్లాస్ లే అవుట్ ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపిన ఆయన.. ఇప్పటికే మంగళ్‌పల్లి లాజిస్టిక్ పార్కు వినియోగంలోకి వచ్చిందని పేర్కొన్నారు. త్వరలో బాటసింగారం లాజిస్టిక్ పార్కు ప్రారంభమవుతుందని... అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో 16 బ్లాకులు కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ట్యాంక్‌బండ్ బ్యూటిఫికేషన్, నెక్లెస్ రోడ్ వీడీసీసీ రోడ్డు పనులు పూర్తి కావొస్తున్నాయని వివరించారు. ఉప్పల్, మెహదీపట్నం వద్ద స్కైవే పనులు జరుగుతున్నాయని కొద్ది నెలల్లోనే ఈ రెండు స్కైవేలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని సతీష్ చెప్పారు.
ఇదీ చదవండి: కర్నల్ సంతోష్‌కుమార్ భార్యకు కలెక్టరేట్లో సన్మానం