Ramanuja Sahasrabdi Utsav : రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో ఏడో రోజు పెద్ద సంఖ్యలో పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆచార్యులు రాకతో సందడిగా మారింది. రథ సప్తమిని పురస్కరించుకొని యాగశాలలో శ్రీనారసింహ ఇష్టి హోమం నిర్వహిస్తున్నారు. ప్రవచన మండపంలో ప్రత్యేకంగా ధర్మాచార్య సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 450 మంది స్వామిజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆచార్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అతిథులను సాధార స్వాగతం పలికిన చినజీయర్ స్వామి... 4 అంశాలపై ధర్మాచార్య సదస్సులో చర్చించనున్నట్లు వెల్లడించారు. సమానత్వం, జాతి వివక్ష, వ్యవసాయాధారిత ఆరోగ్యం, ప్రపంచంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల కలిగే ప్రయోజనాలను నేడు, రేపు ఆచార్యులంతా చర్చించి పలు తీర్మానాలు చేస్తారని చినజీయర్ స్వామి తెలిపారు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ధర్మాచార్య సదస్సు జరుగుతుందని పేర్కొన్న చినజీయర్ స్వామి.... జీయర్ కళాశాల ప్రాంగణంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మన నియమాన్ని మనం పాటించాలి. పక్కవాళ్ల నియమాలను గౌరవించాలి. స్వీయ ఆరాధన సర్వ ఆదరణ. సమాజం మంచి కోసం పనిచేయాలి. ఆస్తికుడు, నాస్తికుడు ఎవరైనా వారి మార్గంలో సమాజ పురోగతికి పాటుపడాలి.
-చినజీయర్ స్వామి, సమతామూర్తి కేంద్రం వ్యవస్థాపకులు
ముచ్చింతల్‌కు అమిత్ షా
మరోవైపు సమతామూర్తి కేంద్ర సందర్శనకు అతిథులు, సామాన్య భక్తుల తాకిడి పెరుగుతోంది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చి సమతామూర్తి కేంద్రాన్ని దర్శించుకొని వెళ్తున్నారు. సినీనటులు రాజేంద్రప్రసాద్‌తో పాటు దర్శకుడు వి.వి.వినాయక్ చినజీయర్ స్వామిని కలిసి ఆశీర్వచనాలు అందుకున్నారు. సాయంత్రం 5 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు.
ఇదీ చదవండి: AP CM Jagan on Samatamurthy: 'సమతామూర్తి.. భవిష్యత్ తరాలకు స్ఫూర్తి'