ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మూడురోజులుగా రంగారెడ్డి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. జోరువానలకు హయత్‌నగర్ పరిధిలోని పద్మావతికాలనీ, విజయపురికాలనీలో ఇళ్ల మధ్య వరదనీరు చేరింది. కాలనీల్లోని రహదారులన్ని చెరువులను తలపిస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. కాలనీవాసులు నిత్యావసరాల కోసం బయట అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. మూడు రోజులుగా నానా కష్టాలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.
అదే నిర్లక్ష్యం
2020.. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, డిసెంబరు..! ఈ నాలుగు నెలలు భాగ్యనగరంలో మిగిల్చిన నష్టం అంతాఇంతా కాదు. వేల ఇళ్లు నీట మునిగాయి.. లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. అయినా బల్దియా అధికారులకు కనీసం చీటకుట్టినట్లు లేదు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో అదే నిర్లక్ష్యం(GHMC Negligence). భూగర్భ డ్రైనేజీలు, సీసీరోడ్లు, పైపులైన్ల లీకేజీలు, కేబుళ్లు.. ఇలా ఒక్కో కారణంతో ఒక్కోచోట ఎక్కడికక్కడ రోడ్లను తవ్వి వదిలేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. ఫిర్యాదులిచ్చినా కదలిక లేదని నగరవాసులు మండిపడుతున్నారు.
ఇదీ చదవండి: PROJECTS: జూరాలకు పోటెత్తిన కృష్ణమ్మ