R Krishnaiah on BC Reservations: నేడు ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని.. అన్ని రాజకీయ పార్టీల్లో డబ్బు ఉన్నవారు, అగ్రకులాల వారే అధికారం చెలాయిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవం పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా మేదరి సంఘం ఆధ్వర్యంలో తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ గార్డెన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రపంచ నాగరికతకు పునాది వెదురు: ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణయ్య.. ప్రపంచ నాగరికతకు పునాది వెదురు అన్నారు. ఇప్పుడు ప్లాస్టిక్ వాడకం పెరిగిన తర్వాత వెదురు వృత్తి దెబ్బతిన్నదని పేర్కొన్నారు. పుట్టినప్పటి నుంచి కాటివరకు వెదురు, మేదరులు లేనిది జీవనం ముందుకు సాగడం కష్టం అని అన్నారు. గతంలో వెదురుతో మేదరులు జీవనం కొనసాగించే వారని గుర్తు చేశారు. తట్ట, బుట్ట, గంప సాట ఇలా మనిషి జీవన విధానంలో ప్రథమ భూమిక మేదరిదన్నారు.
కులాభివృద్ధిలో చదువు కీలకం: పుట్టినప్పటి నుంచి పుట్టెడు కష్టాలతో మేదరి కులం ఉందన్నారు. సమాజానికి ఉపయోగపడే కులవృత్తులు చేస్తున్న కులాలకు ప్రభుత్వాలు ఏం ఇచ్చాయని ప్రశ్నించారు. ప్రభుత్వాలను ప్రశ్నించినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. ప్రతి కులాభివృద్ధిలో చదువు కీలకం.. దానితో అధికారం చేతికొస్తుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు వేల హాస్టళ్లు ఉన్నాయన్న ఆయన.. గురుకులాల కోసం కొట్లాడితే 1,200 గురుకురాలు మంజూరయ్యాయని తెలిపారు.
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి: రాష్ట్రంలో గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పించారో.. అలాగే బీసీలకు ఉన్న 29 శాతం రిజర్వేషన్లను 50 శాతం కల్పించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో, పంచాయతీరాజ్‌లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు ఎవరూ నిద్రపోవద్దని ఆయన సూచించారు. బీసీలు అందరూ ఐక్యంగా ఉండాలని తాను బీసీ కోసం చట్టసభల్లో పోరాడుతున్నానని వివరించారు.
"నేడు ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. అన్ని రాజకీయ పార్టీలలో డబ్బు ఉన్నవారు, అగ్రకులాల వారే ఈరోజు అధికారం చెలాయిస్తున్నారు. రాష్ట్రంలో గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతం రిజర్వేషన్లు ఎలా పెంచారో అలాగే బీసీలకు ఉన్న 29 శాతం రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలి. చట్టసభల్లో, పంచాయతీ రాజ్‌లో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. బీసీలు ఐక్యంగా పోరాడి చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించే వరకు ఏ ఒక్క బీసీ నిద్రపోకూడదు".-ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
ఇవీ చదవండి: