awareness programme for criminals: రంగారెడ్డిలోని ఎల్బీనగర్లో నేరస్తుల కోసం పోలీసులు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నేరాలకు పాల్పడటం వల్ల వారు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియజేశారు. నేరాలు చేయడం వల్ల జరిగే అనర్థాల గురించి ఈ కార్యక్రమంలో వివరించారు. నేరస్థులలో మార్పు తీసుకురావడం కోసం, వారు తర్వాతి కాలంలో ఉన్నతంగా జీవించడం కోసం ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.
రంగారెడ్డి ఎల్బీనగర్లోని కుషాల్ గార్డెన్స్‌లో "మార్పు కోసం ముందడుగు" పేరుతో నేర చరిత్ర గల వారిలో మార్పు కోసం సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో నేరాలకు పాల్పడిన వారు నేరాలు వీడి ప్రస్తుత సమాజంతో నవజీవనాన్ని గడుపుతూ హుందాగా జీవించాల్సిన అవసరం ఉందన్నారు. నేరస్తులు తొందరపాటులో నేరాలు చేసినా సరే తప్పు చేయని వారి కుటుంబం కూడా దాని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుందని తెలిపారు.
గతాన్ని మరచిపోయి మారిన మనసుతో ముందడుగు వేయాలని, అందులో వారి కుటుంబ పాత్ర చాలా ముఖ్యమని పేర్కొన్నారు. జైలులో గడిపే వారికంటే నేరాలకు పాల్పడకుండా సమాజంలో మంచి పౌరులుగా ఉండే వారికి కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న సుమారు 400 మంది పాత నేరస్తులు, డీసీపీలు, ఏసీపీలు, సీఐలు హాజరయ్యారు. వక్త ఆకెళ్ళ రాఘవేందర్ తన మోటివేషనల్ స్పీచ్ చేశారు. ఈ సదస్సుకు హాజరైన పాత నేరస్తులు పోలీస్ శాఖ వారు తమలో మార్పు కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంపై తమ సంతోషాన్ని వ్యక్తం చేసినారు.
"నేరస్థులందరూ కూడా తమ తప్పును తెలుసుకుని, ఒప్పుకుని రాబోయే రోజుల్లో అలాంటి తప్పు జరగకుండా చూడాలని ఆ మార్పు తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అలాగే వీరి కోసం మోటివేషన్ స్పీకర్‌ను పిలవడం జరిగింది. లయన్స్ క్లబ్ వైపు నుంచి కూడా వారు జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి వారికి సరైన స్కిల్స్ నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే నేరస్థులు నేరం చేస్తే సమాజానికి ఎలాంటి నష్టం ఉంటుంది.. మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది అని తెలియజేసి రాబోయే రోజుల్లో ఎలాంటి తప్పులు చేయకుండా ఒక మంచి పౌరుడిగా ఎలా ఉండాలో వారికి తెలియజేశాము."_ డీఎస్ చౌహాన్, రాచకొండ పోలీస్ కమిషనర్
ఇవీ చదవండి: