Love Marriage : చిన్నప్పట్నుంచి ఎంతో అపురూపంగా చూసుకున్న కుమార్తె తమ మాట కాదని నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని కలత చెందే తల్లిదండ్రులు ఎంతోమంది. తోడబుట్టిన వారి పెళ్లిళ్లకు ఇబ్బందులు ఎదురవుతాయనో, బంధువర్గంలో చిన్నతనంగా ఉంటుందనో పలువురు అభ్యంతరాలు చెప్తుంటారు. ఆ వివాహం కులాంతరమైనా, మతాంతరమైనా, ఒకే కులమైనా పరువు ప్రతిష్ఠలే ముఖ్యమని భావించి వ్యతిరేకిస్తున్నారు. ఒక్కోసారి ఈ వ్యతిరేకత హత్యల వంటి విపరీత చర్యలకు ప్రేరేపిస్తోంది.
తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో కుమార్తె ప్రేమను అంగీకరించని తల్లిదండ్రులు ఆమె గొంతు కోసి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవలే రాజధానిలో ప్రేమవివాహం చేసుకున్న ఇద్దరు అబ్బాయిల హత్యలు జరిగాయి. అంతక్రితం మిర్యాలగూడ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ హయత్‌నగర్‌కు చెందిన యువతి లక్ష్మి ప్రేమ వివాహం ఎంతో భిన్నం. ఆమె పెళ్లి విషయంలో తొలుత తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా ఆర్నెల్లలో వారి మనసు మారింది. ఎక్కడో దూరంగా ఉంటున్న అల్లుడిని, కూతురిని ఇంటికి పిలిచి పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగా పెళ్లి వేడుక నిర్వహించారు.
చెల్లి పెళ్లి కుదరడంతో.. ప్రైవేటు ఉద్యోగి అయిన లక్ష్మి ఓ యువకుడిని ప్రేమించింది. అబ్బాయి స్థానికంగా పరిచయం ఉన్న వ్యక్తే అయినా కులాంతర వివాహానికి పెద్దలు ససేమిరా అన్నారు. ఇంట్లోవాళ్లని కాదని వారు ఆరునెలల క్రితం ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల కావడంతో లక్ష్మి అక్కడికి బదిలీ చేయించుకుని వెళ్లింది. పెళ్లి విషయంలో సంతోషంగానే ఉన్నా అమ్మానాన్నలు దూరమయ్యారనే లోటు మాత్రం ఆమెను బాధించేది. మరోవైపు.. ఆమె చెల్లికి వివాహం కుదిరింది. అటువైపు బంధువులకు లక్ష్మి కులాంతర ప్రేమ వివాహం గురించి తెలిసి అభ్యంతరం లేదని చెప్పడంతో ఆమె తల్లిదండ్రుల్లో అప్పటివరకు ఉన్న భయం పోయింది. పెద్దకుమార్తె, అల్లుడు, వారి బంధువులను పెళ్లికి రావాలని ఆహ్వానించారు. వస్తే ఎక్కడ విడదీస్తారోననే భయం లక్ష్మిలో ఉండగా వచ్చాక ఆ అనుమానాలు పటాపంచలయ్యాయి. పెద్ద కుమార్తె పెళ్లి తమ కళ్ల ముందు జరగలేదని.. సంప్రదాయం ప్రకారం మళ్లీ వివాహం చేశారు. కాస్త ఆలస్యంగానైనా కుమార్తె ప్రేమవివాహాన్ని తల్లిదండ్రులు అంగీకరించి, ఆశీర్వదించడంతో కథ సుఖాంతమైంది.
ఇవీ చూడండి: Group One Applications: 503 పోస్టులు... 2.62 లక్షల అభ్యర్థులు...
ఒక్కొక్కరి అకౌంట్లో రూ.13 కోట్లు.. మొత్తం 100 మందికి.. ఎలా జరిగింది?