కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందరూ వేలిముద్రలు వేయడం సాధ్యం కాదన్న ఉద్దేశంతో సర్కారు వీఆర్‌ఏ, వీఆర్వో, వార్డు సభ్యుడులో ఒకరి వేలిముద్ర వేస్తే రేషన్ వచ్చేలా అవకాశం కల్పించారు. దీని వల్ల వైరస్ వ్యాప్తి కాకుండా చూడొచ్చనేది ఉద్దేశం. ఈ నెలలోనూ ఇదే విధానం అనుసరిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
గ్రామాల్లో సాంకేతిక సమస్యల కారణంగా ఈ నెల వీఆర్‌ఏలు, వీఆర్వోల వేలిముద్రలు వేసే విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయని డీలర్లు చెబుతున్నారు. వారి వేలిముద్రలు యంత్రాలు అక్కడక్కడ తీసుకోవడం లేదు. దీంతో వృద్ధులకు రేషన్ కష్టాలు తప్పటం లేదు.
హైదరాబాద్ నగరశివారులోని గ్రామాల్లో వృద్ధులకు చేతి వేళ్లు అరిగిపోయి వేలిముద్రలు సరిగా పడేవి కావు. దీనివల్ల నెలల తరబడి రేషన్ తీసుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆ తర్వాత మూడు నెలలపాటు రేషన్ తీసుకోలేదన్న కారణంగా సాంకేతికంగా జాబితా నుంచి వారి పేరు అధికారులు తొలగించేవారు. స్థానికంగా ఏవో చిన్నపాటి పనులు చేసుకుంటూ పొట్టపోసుకునేవారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా పనుల్లేక ఇబ్బంది పడుతున్నారు.
మూడు నెలలుగా రేషను తీసుకోని పక్షంలో సరకులు ఇవ్వడం నిలిపివేయలేదని, వేలిముద్ర వేసి తీసుకునేలా వెసులుబాటు కల్పించామని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.హరీశ్ తెలిపారు.
పోర్టబులిటీలో వేలిముద్ర వేయాల్సిందే!
రేషను లబ్ధిదారుల ఇబ్బందులు తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోర్టబులిటీ విధానం తీసుకొచ్చారు. దీనివల్ల ఇతర జిల్లాలకు చెందిన కార్డుదారులు ఇక్కడే రేషన్ తీసుకుంటున్నారు. వీరు మాత్రం వేలిముద్ర వేయాల్సిందే. ఈ నెలలో ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 2.71 లక్షల మంది లబ్ధిదారులు రేషన్ తీసుకున్నారు. దాదాపు 15 లక్షల మంది పోర్టబులిబీ విధానంలోనే రేషన్ తీసుకుంటారని అంచనా.