ఏ మనిషి అయినా చివరిరోజుల్లో కుటుంబ సభ్యుల సమక్షంలో చీకుచింతా లేకుండా కన్నుమూయాలి అనుకుంటాడు. కానీ అందరూ ఉండి కూడా ఓ వ్యక్తి తన జీవిత చరమాంకంలో దుర్భర జీవితం అనుభవించాడు. అలాగే తనువు చాలించాడు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ఎల్వేర్తిలో ఓ వ్యక్తి కన్నీటి గాథ ఇది.
భర్తను వదిలేసి తనదారి చూసుకుంది
గ్రామానికి చెందిన కంకంటి సత్తయ్య, యూదమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. తనకున్న మూడెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఎనిమిదేళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో కొడుకు చనిపోయాడు. కొడుకు మృతితో తండ్రి కుదేలైపోయాడు. అదే సమయంలో వ్యవసాయ భూమిని అమ్మించేసింది భార్య. ఉన్న ఇల్లు కూడా అమ్మి ఆ సొమ్ముతో భర్తను వదిలేసి చేవెళ్లకు వెళ్లిపోయింది. అక్కడ కూతురి దగ్గర ఉంటోంది. వృద్ధుడైన సత్తయ్య దిక్కుతోచని స్థితిలో ఊరిలోనే ఉండిపోయాడు. గ్రామంలోని డ్వాక్రా భవనంలోనే ఉంటూ... పాఠశాలలో భోజనం తిని బతికేవాడు.
అయిన వాళ్ల ఆదరణ కరవై
ఇటీవల అనారోగ్యానికి గురైన సత్తయ్య లేవలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా కాలు కదపలేని పరిస్థితిలో నరకం అనుభవించాడు. అక్కడే కాలకృత్యాలు తీర్చుకోవడంతో తీవ్ర దుర్ఘందం వెదజల్లేది. బతికుండగానే నరకం అనుభవించిన సత్తయ్యను పట్టించుకునేవారే కరవయ్యారు.
బతికుండగానే స్మశానానికి
ఇటీవల గ్రామానికొచ్చిన సత్తయ్య భార్య అతడి బాగోగులు పట్టించుకోకుండా వెళ్లిపోయింది. చేసేదేమీ లేక పారిశుద్ధ్య కార్మికులు చెత్తను తరలించే ఆటోలో తీసుకెళ్లి ఊరి చివర ఉన్న శ్మశానంలో వదిలేశారు.
ఎంతటి దుర్భర జీవితం
చావుబతుకుల్లో కొట్టిమిట్టాడుతున్న సత్తయ్యను చూసి జాలిపడిన గ్రామస్థులు అతన్ని బుధవారం సంగారెడ్డిలోని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూశాడు. సత్తయ్య మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. అతడు అనుభవించిన దుర్భర పరిస్థితి చూపరులను కంటతడి పెట్టించింది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అంటూ భార్యను పూజించే మన దేశంలో ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు.
ఇదీ చూడండి: ఆర్టీసీ కార్మికుల పైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు