Nikhat Zareen on Olympics: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ బాక్సింగ్ క్రీడల్లో పతకం సాధించడమే తన లక్ష్యమని ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ అన్నారు. వచ్చే ఏడాది సెలెక్షన్స్ జరగనున్న దృష్ట్యా సాధన చేస్తున్నానని తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని ఎల్బీనగర్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన "మీట్ ది ఛాంపియన్" కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు.
కొద్ది సేపు విద్యార్థులకు బాక్సింగ్ మెళకువలను నిఖత్ జరీన్ వారికి నేర్పించారు. చిన్నారులతో కలిసి బాస్కెట్ బాల్ ఆడి సందడి చేశారు. ఫిట్ ఇండియాలో భాగంగా సమతుల ఆహారం, క్రీడలు, శరీర సౌష్టవం వంటి అంశాల ప్రాధాన్యత తెలియజేశారు. దేశంలో తెలుగు రాష్ట్రాల్లో క్రీడలకు ఆదరణ పెరుగుతుందని చెప్పారు. ఏపీలో బాక్సింగ్‌కు ప్రోత్సాహం కల్పిస్తామని సీఎం జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు.
రాబోయే రోజుల్లో బాక్సింగ్ అకాడమీ నెలకొల్పి యువతను బాక్సర్లుగా తీర్చిదిద్దుతానని నిఖత్ జరీన్ పేర్కొన్నారు. విద్యార్థులందరికి క్రీడల్లో ప్రావీణ్యం ఉండాలని సూచించారు. క్రీడలను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఏదైనా సాధించాలని కోరారు. తాను ఆరవ తరగతిలో క్రీడల పట్ల ఆసక్తి కలిగిందని.. రన్నింగ్, లాంగ్ జంప్, షాట్ పుట్ క్రీడలలో ప్రతిభ కనబరిచానని తెలిపారు. బాక్సింగ్‌లో మహిళలు ఎందుకు లేరని తన నాన్నను అడిగానని చెప్పారు.
అప్పటి నుంచి తన తండ్రి ప్రోత్సాహంతో నిజామాబాద్‌లో శిక్షణ తీసుకుంటూ నిరంతరం సాధన చేశానన్నారు. తద్వారా బాక్సింగ్‌లో ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించి.. దేశానికి గర్వకారణంగా నిలిచానని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవాలని సూచించారు. పిల్లలకు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సమతుల ఆహారం తీసుకోవాలని చెప్పారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలన్నారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని నిఖత్ జరీన్ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా అదే పాఠశాలల్లో చదువుతున్న రియానా అనే బాలిక గ్రేస్ పెన్సిల్‌తో గీసిన నిఖత్ జరీన్ చిత్రాన్ని ఆమెకు బహూకరించింది.
"జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మీ పిల్లలను క్రీడల పట్ల ప్రోత్సహించాలి. ఫలితంగా క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించి రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తెస్తారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవాలి. ఇప్పుడు నా దృష్టంతా ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడంపైనే ఉంది." - నిఖత్ జరీన్, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్
ఇవీ చదవండి: విజయ డైరీ రైతులకు గుడ్‌న్యూస్, ఏంటంటే