రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తి నుంచి మేడిపల్లి వరకు నిర్మించనున్న రహదారి నిర్మాణ ప్రారంభ కార్యక్రమం గురువారం రసాభాసగా మారింది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(తెరాస), యాచారం ఎంపీపీ కొప్పు సుకన్య (భాజపా) మధ్య జరిగిన గొడవలో ఎంపీపీ స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే భాజపా నేతలు ఆమెను బి.ఎన్ రెడ్డిలోని ఓ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీపీ సుకన్యని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. ఎమ్మెల్యేకు ఎదురు తిరిగి పోరాడినందుకు ఆమెను అభినందించారు. కమలం పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుందని... అధైర్యపడవద్దని సూచించారు. పథకం ప్రకారమే దాడి చేశారని సంజయ్ ఆరోపించారు. కొంతమంది పోలీస్ అధికారుల ప్రవర్తన పోలీస్ శాఖకి చెడ్డ పెరు తెస్తోందన్నారు.
పేద ప్రజలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి స్పందించడం లేదని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారు ఒక్కరు కూడా మంత్రిగా లేరని... దయచేసి ముఖ్యమంత్రి సంస్కారం నేర్చుకోవాలన్నారు. అలాగే మంత్రులకు, ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ, సంస్కారం నేర్పించాలని సూచించారు. ఇలా ఒక దళిత మహిళ ప్రజా ప్రతినిధిపై నిర్లజ్జగా దాడి చేసిన మీ పార్టీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే దాడి చేసిన పోలీస్ అధికారుల పై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. లేనియెడల చట్ట పరంగా ముందుకెళ్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.