రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ఇటీవలే ప్రారంభించిన కోహెడ పంట్ల మార్కెట్లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి షెడ్లు, పైకప్పులు ఎగిరిపోయాయి. ఘటనా స్థలంలో రైతులతోపాటు, దళారులు, వ్యాపారులు ఉండగా సుమారు 20 మందికి గాయాలయ్యాయి. సుమారు ఆరు మందికి గాయాలు కాగా ఒకరికి తీవ్ర గాయపడ్డారు. క్షతగాత్రులకు హయత్ నగర్ పరిధిలోని వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
సందర్శించిన మంత్రి సబితా
కొద్దిసేపు ఈదురుగాలులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి షెడ్లపైన ఉన్న ఇనుప రేకులు ఎగిరిపడ్డాయి. సమాచారం అందుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిలు మార్కెట్‌ను సందర్శించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని, గాయపడినవారి చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
ప్రభుత్వానిదే బాధ్యత: బండి సంజయ్
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి సదుపాయాలు లేని కోహెడ పండ్ల మార్కెట్‌కి గడ్డిఅన్నారం మార్కెట్ తరలించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై పూర్తిగా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.