రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్ ప్రాంతాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ముంపు ప్రాంతాల నుంచి నీటిని బయటకు పంపే దిశగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవ తీసుకున్నారు. బర్హాన్‌ఖాన్ చెరువు నుంచి జేసిబీలతో ఓ కాలువ ఏర్పాటు చేసి నీటిని బయటకు వదులుతున్నారు. వరద బాధితులు, స్థానికులతో మంత్రి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యేవిధంగా చర్యలు చేపడుతున్నామని ఆమె అన్నారు.
వరద సమస్య వేగవంతంగా పరిష్కరించడం కోసం సీఎస్, కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని మంత్రి చెప్పారు. అన్ని చెరువుల ఎఫ్టీఎల్ ఫిక్స్ చేస్తున్నామని, భవిషత్తులో ఎఫ్టీఎల్ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అన్ని ముంపు ప్రాంతాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు జల్పల్లి మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్ మజర్, పలువురు తెరాస నేతలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : గొర్రెకుంట మృత్యుబావి కేసులో సంజయ్‌కుమార్‌కు ఉరిశిక్ష