Sabitha at CC Cameras Inauguration: సీసీ కెమెరాలను చూస్తే నేరాలు చేయాలంటే భయపడతారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఒక కెమెరా వంద మంది పోలీసులతో సమానమని వెల్లడించారు. టీఎస్ఐఐసీ ద్వారా రూ.2.91 కోట్లతో అందించిన 284 సీసీ కెమెరాలను జిల్లెలగూడలోని ఎస్‌వైఆర్ కన్వెన్షన్‌లో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు.
మహేశ్వరం నియోజకవర్గములోనే రూ.3.50 కోట్ల విలువ చేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు రాచకొండ పోలీస్ కమిషనర్‌ను మంత్రి అభినందించారు. అలాగే బడంగ్ పేట్ కార్పొరేషన్లో రూ.1.20 కోట్లతో సీసీ కెమెరాల కు, మీర్ పేట్ కార్పొరేషన్లో 25 లక్షలు, జల్పల్లి మునిసిపాలిటీలో రూ.50 లక్షలు బడ్జెట్లో కేటాయించడం జరిగిందని తెలిపారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. మీర్ పేట్, బాలాపూర్, పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
సీసీ కెమెరాల సాంకేతికతో రాష్ట్రంలో కేసులను 24 గంటలో ఛేదించటానికి అవకాశం ఏర్పడుతుందని మంత్రి సబితా తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో 9 లక్షల 20 వేల సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం దేశంలోనే అన్ని రాష్టాల కన్నా ఎక్కువని పేర్కొన్నారు. రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే అందులో పోలీస్ శాఖవే 18 వేల ఉద్యోగాలు ఉండటం అందుకు నిదర్శనమన్నారు. కెమెరాను చూస్తేనే భయంతో నేరాలు చేయడానికి వెనకాడుతారని.. ఒక కెమెరా వంద మంది పోలీసులతో సమానమని తెలిపాకు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల తీవ్రత తగ్గిందని తెలిపారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒక లక్ష 50 వేల సీసీ కెమెరాలు ఉంటే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3 లక్షలపై చిలుకు సీసీ కెమెరాలు ఉన్నాయని సబితా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, బడంగ్ పేట్ మేయర్ పారిజాత నరసింహ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహాం శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పాలమూరు పచ్చబడితే కొంతమంది కళ్లు ఎర్రబడుతున్నాయి: కేటీఆర్