యువ, ఔత్సాహిక రైతులు కొత్త ఉపాధి మార్గాలు వెతుక్కునే క్రమంలో సంప్రదాయ పంటలకు భిన్నంగా... సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరు సమీపంలోని ప్రగతి రిసార్ట్స్‌లో మునగ, కరివేపాకు, నిమ్మ, ఇతర ఔషధ తోటలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రగతి రిసార్ట్స్ ముఖ ద్వారం వద్ద అరుదైన కల్పవృక్షం మొక్క నాటారు. సువిశాల విస్తీర్ణంలో సేంద్రీయ విధానంలో సాగవుతున్న మునగ తోటలో కలియ తిరిగి పరిశీలించారు. మునగ సాగు విధానం, ఉత్పత్తి, ఉత్పాదకత, అదనపు విలువ జోడించి ఉప ఉత్పత్తుల తయారీ, వినియోగం, మార్కెటింగ్ వంటి అంశాలు అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో ఆహార ధాన్యాల పంటలు, పండ్లు, కూరగాయలతోపాటు దేశీయంగా అంతర్జాతీయంగా డిమాండ్ గల కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వంటివి సాగు చేసుకుంటే రైతులు మంచి లాభాలు పొందవచ్చని మంత్రి సూచించారు. విదేశీ ఎగుమతులకు విస్తృత అవకాశాలు ఉన్నందున... బహుళ పోషక విలువలు గల మునగ సాగును ప్రొత్సహించనున్నట్టు వెల్లడించారు. మునగ, కరివేపాకు ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలకు ప్రోత్సాహం అందిబోతున్నట్టు ప్రకటించారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ రోజు వారీ ఆహారంలో ఆరు గ్రాముల చొప్పున మునగ పొడి తీసుకోవాలని పోషకాహార నిపుణులు సిఫారసు చేసినందున... 4 కోట్ల జనాభాకు సరిపడాలంటే... లక్ష ఎకరాల సాగుకు అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, ప్రగతి రిసార్ట్స్ అధినేత డాక్టర్ జీబీకే రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: దేశంలో మరో 78,357 కేసులు, 1045 మరణాలు