హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది కాబట్టే అనేక కంపెనీలు వచ్చాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్‌లో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ప్రజలకు ఒక్కటే రెండు పడకల గదుల ఇళ్లే బాకీ ఉన్నాయని... అది కూడా నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఆరేళ్లలో తెరాస అనేక అభివృద్ధి పనులు చేసిందన్న కేటీఆర్... ఫ్లై ఓవర్లు కట్టుకున్నామని, రోడ్ల సమస్య కొంత మేరకు పరిష్కరించున్నామని చెప్పుకొచ్చారు. భాజపా నాయకులు ప్రచారానికి వస్తే ఏం చేశారని నిలదీయాలని సూచించారు.
ఇక్కడ ప్రశాంతంగా ఉంది కాబట్టే... హైదరాబాద్‌కు అమెజాన్, ఆపిల్, ఫేస్బుక్, గూగుల్ వంటి కంపెనీలు వచ్చాయి. భాజపా నాయకులు ప్రచారానికి వస్తే ఏం చేశారని నిలదీయండి. ఆరేళ్లల్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పుడేమో రూ.25 వేలు ఇస్తామంటున్నారు. మీరు ఆగమాగం చేస్తామంటే... ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు. హుషారు హైదరాబాద్. అర్హులకు ఎన్నికల తర్వాత వరద సాయం కచ్చితంగా అందిస్తాం.
--- మన్సూరాబాద్ రోడ్‌షోలో కేటీఆర్
కాంగ్రెస్ హయాంలో రూ. 200ల పింఛన్ ఇస్తే... ఇప్పుడు రూ.2 వేల పింఛన్ ఇస్తున్నామని మంత్రి వివరించారు. వరద వచ్చి అన్నీ కోల్పోతే 6.50 లక్షల మందికి రూ.10వేలు ఇస్తే పేదోడి నోటికాడి ముద్ద లాక్కున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
కేంద్రం ఏమో చలాన్లు తెస్తుంది. ఇక్కడి వాళ్లమో చట్టబండలు చేస్తామంటున్నారు. కొట్లాటలు పెట్టుకునే హైదరాబాద్ కావాలా? ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ కావాలా ఆలోచించండి. రిజిస్ట్రేషన్ సమస్యలు పరిష్కరిస్తాం ఆ బాధ్యత నాది. మాపై విశ్వాసం ఉంచండి.
--- మన్సూరాబాద్ రోడ్‌షోలో కేటీఆర్
ఇదీ చూడండి: 'హైదరాబాద్ గులాబీలు కావాలా... గుజరాతీ గులాములు కావాలా?'