పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రత్యేక భవనాన్ని నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెందుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్‌లో నిర్మిస్తున్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనాన్ని మంత్రి కొప్పుల, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పరిశీలించారు.
రాష్ట్రంలో దళితులకు ఉన్నత విద్యను అందించే భవనాన్ని నిర్మించడం హర్షించదగ్గ విషయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రూ. 26 కోట్లతో నిర్మించినట్లు ఆయన పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని ఏప్రిల్ 14న భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు.
ఈ భవనంలో సుమారు 25 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చెప్పుకోదగ్గ విషయమని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దళితుల కోసం పాటు పడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, గువ్వల బాలరాజు, ఆత్రం సక్కు, కాలే యాదయ్య, ఎమ్మెల్సీ ప్రభాకర్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: వ్యవసాయ బావిలో చిరుత.. బయటికి తీసేందుకు విశ్వప్రయత్నం