ప్రకృతి వనాల అభివృద్ధి ప్రజలకెంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని రిజర్వు ఫారెస్టులో మార్గదర్శి సంస్థ తరపున 53 వేల ఎకరాల్లో రెండేళ్లలో 50 వేల మొక్కలు నాటినట్లు శైలజాకిరణ్ తెలిపారు. ఇవాళ ఇబ్రంహీపట్నం రేంజ్ అధికారులకు అప్పగించారు.
2019 ఆగస్టులో తమ వంతు సామాజిక బాధ్యతగా రిజర్వు ఫారెస్టులో రావి, వేప, చింత, నెమలినార, మద్ది, గుల్మోరా, బాదం, జామ, అల్లనేరడి, చిన్నబాదం తదితర రకాల మొక్కలను మార్గదర్శి నాటింది. వాటి సంరక్షణ, నిర్వాహణ బాధ్యతలను తీసుకుంది. ఈ క్రమంలో గుర్రంగూడ రిజర్వు ఫారెస్టును సందర్శించిన శైలజాకిరణ్... ఫారెస్ట్ రేంజ్ అధికారి విష్ణువర్దన్ రావుతో కలిసి మొక్కలను పరిశీలించారు.
మొక్కలన్నీ చాలా ఆరోగ్యవంతంగా, ఏపుగా పెరగడంతో ఆనందం వ్యక్తం చేశారు. రిజర్వు ఫారెస్టులో నాటిన మొక్కలతో ఈ ప్రాంతం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంగా మారుతోందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల ప్రజలకు విడిది కేంద్రంగా ఉంటుందని తెలిపారు. అటవీశాఖ అధికారుల సహకారంతో మరో 50 వేల మొక్కలు నాటేందుకు మార్గదర్శి సంస్థ సిద్ధంగా ఉన్నట్లు శైలజాకిరణ్ వెల్లడించారు.
ఇదీ చదవండి: ఆమె వయసు 13.. రాసిన నవలలు 12