rtc timings: లాక్‌డౌన్ సడలింపు సమయం... ప్రయాణికుల అవస్థలు - rtc passengers problems
లాక్‌డౌన్ ముగిసే సమయానికి బస్టాండ్‌లకు చేరుకున్న ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరలేక అవస్థలు పడుతున్నారు. తిరిగి వెనక్కి పోలేక సొంతూళ్లకు చేరుకోలేక ప్రయాణ ప్రాంగణాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తిరిగి లాక్‌డౌన్ సడలింపు సమయం వరకు బస్టాండ్‌లోనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి . పిల్లాపాపలతో సహా వచ్చిన వారంతా బస్టాండ్‌లోనే తింటూ..అక్కడే విశ్రమిస్తున్నారు.
![rtc timings: లాక్‌డౌన్ సడలింపు సమయం... ప్రయాణికుల అవస్థలు lockdown-relaxation-time-passenger-problems-in-telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11961503-350-11961503-1622440328022.jpg?imwidth=3840)
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్ వల్ల ప్రజా రవాణాలో భాగమైన ఆర్టీసీ బస్సులు సైతం పూర్తిస్థాయిలో నడపడం లేదు. లాక్‌డౌన్ సడలింపు వేళలు ముగుస్తున్న సమయంలో బస్టాండ్‌లకు చేరుకున్న ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు. MGBS, JBSకు చేరుకున్న ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక అక్కడే నిరీక్షిస్తున్నారు.
ప్రయాణికుల ఇబ్బందులు
కొన్ని స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు అందిస్తున్న ఆహారంతో కడుపు నింపుకుంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను లాక్‌డౌన్ సడలింపు వేళల కంటే ముందే ఆపేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. లాక్‌డౌన్ సడలింపునకు గంట ముందు వచ్చినా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు. అధికారుల సమాచార లోపం వల్లే... ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం ఇవ్వాలి
అసంఘటిత కార్మికుల, వివిధ అత్యవసర, ఆపదలకు వెళ్లి వస్తున్న వారు, వలస కూలీలు, విద్యార్థులు వచ్చి బస్టాండ్లలో చిక్కుకుపోతున్నారు. నిత్యం వందలాది బస్సులతో కళకళలాడే MGBS, JBS ప్రయాణ ప్రాంగణాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో కుటుంబంతో సహా పడరాని పాట్లు పడాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందుల దృష్ట్యా ఆర్టీసీ అధికారులు బస్సులు బయలుదేరే సమాచారం పక్కాగా ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: covid effect: ఉపాధి కరవై పట్టెడన్నం కోసం సినీకార్మికుల పాట్లు