హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యకు నిరసనగా రెండో రోజు ఆందోళనలు కొనసాగాయి. నాంపల్లి క్రిమినల్ కోర్టు ముందు.... విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. స్థానిక పోలీసులపై తమకు నమ్మకం లేదని.. విచారణ సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో న్యాయవాదుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ... సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఎదుడట న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. నిరసనలో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
విధులు బహిష్కరించి
హత్య ఘటనలో నిందితులు ఎంతటివారైనా...అదుపులోకి తీసుకుని న్యాయం చేయాలని... కూకట్‌పల్లిలో బార్ అసోసియేషన్ సభ్యులు మానవహారం చేపట్టారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆవరణలో క్యాండిల్ ర్యాలీ చేపట్టి... నిరసన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో విధులు బహిష్కరించిన న్యాయవాదులు... విజయవాడ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. నిజామాబాద్‌లో నల్లమాస్కులు ధరించి.. వామన్‌రావు హత్య ఘటనపై నిరసన తెలిపారు.
ఉద్రిక్తతలు
న్యాయవాదుల ఆందోళనల్లో పలుచోట స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. నాంపల్లి కోర్టు ఆవరణలో... ఓ గుర్తుతెలియని వ్యక్తి న్యాయవాదిపై దాడి చేశాడు. అతడిని మిగతా న్యాయవాదులు చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే కొట్టిన వ్యక్తి... బాధిత న్యాయవాది బంధువేనని తేలింది. బంధువైనా కోర్టు ఆవరణలో దాడిచేయడం సరికాదంటూ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వామన్‌రావు హత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించే వరకూ తమ ఆందోళన కొనసాగిస్తామని న్యాయవాదులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : కరోనా నిబంధనలతో జిల్లా న్యాయస్థానాల్లో ఆంక్షల ఎత్తివేత