కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతోన్న ప్రజల కోసం రంగారెడ్డి జిల్లా కొత్తపల్లి ఎంపీటీసీ సభ్యురాలు శోభా సుధాకర్ రెడ్డి ఏదైనా చేయాలని తపించారు. 30 ఏళ్ల కిందట నేర్చుకున్న టైలరింగ్‌ను గుర్తు చేసుకుంటూ మాస్కులను కుట్టి ప్రజలకు అందిస్తున్నారు.
మాస్కుల కొరత తీవ్రంగా ఉండటం, ధర ఎక్కువగా ఉండటం వల్ల ... ఆమే వాటిని సొంతంగా కుట్టడం మొదలుపెట్టారు. వీటి తయారీ కోసం తన కొత్త కాటన్ చీరలను వినియోగిస్తూ రోజూ దాదాపు 200 మాస్కులకు పైగా తయారుచేస్తున్నారు.

గ్రామంలోని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తూ వ్యాధి పట్ల వారికి అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్ తమ గ్రామంలో విజృంభించకుండా ఉండేందుకు లాక్‌డౌన్ కాలాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటూ గ్రామ ప్రజలకు సాయం చేస్తున్నారు.