Jalpally Municipal Commissioner: రంగారెడ్డి జిల్లా జల్పల్లిలోని శ్రీరామ కాలనీ 20వ వార్డులో సమస్యలు పరిష్కరించాలని దాదాపు 50 మంది మహిళలు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కుర్చీలపై కొందరు మరికొందరు నేలపై కూర్చొని కమిషనర్ కోసం వేచి ఉన్నారు.
ఈ విషయం తెలుసుకున్న కమిషనర్ జీపీ కుమార్ వెంటనే తన గది నుంచి బయటకు వచ్చి వారితో ఒక సామాన్య వ్యక్తిగా నేలమీద కూర్చొని వారితో చర్చించారు. ముందుగా మంచినీరు, టీ అందించి తరువాత వారి సమస్యలు విన్నారు. వెంటనే నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఫోన్లో వారి సమస్యలను వివరించారు. అనంతరం త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.
కార్యాలయానికి వచ్చిన మహిళలు సమస్యలు మర్చిపోయి కమిషనర్ జీపీ కుమార్ మమేకమైన తీరును చూసి ఆనందంతో పొంగిపోయారు. కమిషనర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జీపీ కుమార్ పాలనలో తనదైన ముద్రవేశారు. ముఖ్యంగా గత వర్షాకాలంలో భారీవర్షాలకు కాలనీల్లో వరదముంపు ఏర్పడినప్పుడు అక్కడే ఉండి సమస్యను పరిష్కరించి అందరి మన్ననలు పొందారు.
ఇదీ చదవండి: CJI Justice NV Ramana About IAMC : 'హైదరాబాద్ ఐఏఎంసీ ప్రపంచ ఖ్యాతి పొందాలి'