Jalpally Municipal Commissioner: రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్ పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా అధికారులు ఇంటింటికి తిరుగుతూ పన్నులు వసూలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. సకాలంలో పన్నులు చెల్లించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన కోరారు. మొండి బకాయిదారులు పన్నులు ఎగ్గొటే ప్రయత్నం చేస్తే వారిపై కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జీపీ కుమార్ హెచ్చరించారు.
ఈ ఏడాది 2021-2022 సంవత్సరానికి దాదాపు రూ.5.58కోట్ల వసూళ్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జీపీ కుమార్ పేర్కొన్నారు. మున్సిపాలిటీలో 32,534 ఇళ్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఇంటి పన్నులు రూ.3.34 కోట్లు వసూలు చేశామని ఆయన తెలిపారు. ట్రేడ్ లైసెన్స్లు ద్వారా రూ.61వేలు, మ్యూటేషన్ నుంచి రూ.లక్షా 28వేలు వచ్చాయని కమిషనర్ వెల్లడించారు.
గడువు మార్చి31 సమీపిస్తుండడంతో మిగితా బకాయి వసూలు కొరకు వేగాన్ని పెంచిన్నట్టు కమిషనర్ జీపీ కుమార్ తెలియజేశారు. అందులో భాగంగా 8 మంది బిల్ కలెక్టర్లు, అధికారులు సైతం ఇంటిటికి తిరుగుతూ పన్నులు వసూలు చేస్తున్నారన్నారు. ఈ నెలాఖరు వరకు పన్నులు చెల్లించే వారికి రాయితీ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ లేకుంటే దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడాలని కమిషనర్ జీపీ కుమార్, మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లహ బిన్ హమద్ సాది కోరారు.
ఇదీ చదవండి: Jalpally Municipal Commissioner: బాధితులతో మమేకమై.. వారి సమస్యలు విన్న కమిషనర్